ఇదేండ్లలో రూ 359 లక్షల కోట్లకు ఆర్ధిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న ఐదు నుంచి ఏడేండ్లలో రూ 359 లక్షల కోట్ల(5 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థకు ఇది రెట్టింపని తెలిపారు. రూ 359 లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో తయారీ రంగం, వ్యవసాయ రంగం కీలకపాత్ర పోషించనున్నాయని పేర్కొన్నారు. అప్పటికి ఈ రెండు రంగాలు ఆర్థిక వ్యవస్థకు చెరో లక్ష కోట్ల డాలర్ల విలువ చేకూరుస్తాయని తెలిపారు.

ఢిల్లీలోని ద్వారకాలో జరిగిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్, ఎక్స్‌పో సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటూ దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడమని, ఈ నిర్ణయాల పరంపరను కొనసాగిస్తామని స్పష్టం చేసారు. `ప్రజా ప్రయోజనాల కోసం మేం ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. అవసరమైతే ఇక ముందూ అలాంటి నిర్ణయాలు తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక వృద్ధి 8 శాతానికిపైగా పెరుగుతున్నదని చెబుతూ ఈ లెక్కన రానున్న ఐదు, ఏడు ఏండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ రూ 359 లక్షల కోట్లకు చేరుకుంటుందని,  10 ఏండ్ల నాటికి రూ 718 లక్షల కోట్ల వరకు చేరుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఎస్‌బీఐ బ్యాంకులో కొన్ని బ్యాంకులను విలీనం చేశామని, ఈ విలీన ప్రక్రియ కొనసాగింపులో భాగంగా దేనా బ్యాంకు, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

స్థూలంగా చూస్తే భారత ఆర్థిక పునాదులు ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు తెలిపారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమంతో మొబైల్‌ ఫోన్ల తయారీకి మన దేశం కేంద్రంగా మారిందని పేర్కొన్నారు.  ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే మొబైల్‌ ఫోన్లలో 80 శాతం దేశంలోనే తయారవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో రూ.3 లక్షల కోట్ల దిగుమతుల భారం తప్పిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గత నాలుగేళ్లలో నాలుగైదు లక్షల మంది యువకులకు ఉద్యోగాలు లభించాయని ప్రధాని చెప్పారు.

ప్రస్తుతం శంకుస్థాపన జరిగిన కన్వెన్షన్ సెంటర్‌ను రూ.25,703 కోట్లతో దాదాపు 221.37 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ సెంటర్‌ ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం లభిస్తుందని ప్రధాని తెలిపారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటానికి ప్రధాని మోదీ ద్వారకాకు మెట్రో రైలులో ప్రయాణించారు.