ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం చేజిక్కించుకుంటాం

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం చేజిక్కించుకుంటామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ధీమా వ్యక్తంచేశారు. కాకినాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ “‘అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో గతంలో నలుగురే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఏపీలో ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలున్నారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా అధికారం చేజిక్కించుకుంటాం” అంటూ భరోసా వ్యక్తం చేసారు.

ఒకవేళ బిజెపికి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో టీడీపీ మినహా మరే ఇతర పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో బిజెపి భాగస్వామిగా ఉంటుందని కుడా రాంమాధవ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై రాంమాధవ్‌ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ  ప్రజలు టీడీపీని విశ్వసించడం లేదని, ఏపీలో బీజేపీ పాగా వేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.

రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా నిలిచిందని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి, 2019 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రూ.8.50 లక్షల కోట్ల విలువైన వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా నిధులు అందజేస్తోందని రాంమాధవ్‌ చెప్పారు. అయినా కేంద్రం నిధులివ్వడం లేదంటూ సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు రాష్ట్ర వనరులను కట్టబెడితే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని టీడీపీ నేతలు అన్ని రకాలుగా దోచుకుతింటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

కాగా, బీజేపీలో ఉంటూ కొందరు నాయకులు పార్టీకి విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాంమాధవ్‌ తప్పుపట్టారని తెలుస్తున్నది.పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటి వారైనా బీజేపీ ఉపేక్షించదని, వారిని బయటకు సాగనంపుతుందని హెచ్చరించినట్లు చెబుతున్నారు.