కొడాలి నానిపై బీజేపీ ఫిర్యాదు

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, చట్టాన్ని అతిక్రమించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావ్ భూపాల్‌కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎస్పీని కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. 

ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి, అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ టీటీడీ చట్టం, సాంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫారంలో సంతకం పెట్టి హిందూ మతం పట్ల, శ్రీవారి పట్ల గౌరవం ఉందని రాతపూర్వకంగా ప్రకటించాల్సి ఉందని స్పష్టం చేశారు. 

ఈ విషయాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రిగా కొనసాగుతున్న కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వస్తే ఎందుకు డిక్లరేషన్‌పై సంతకం చేయాలంటూ దుర్భాషలాడటం దారుణమని మండిపడ్డారు. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం శిక్షార్హమైన నేరమని విమర్శించారు. ఆధారాలు చూపి మంత్రిపై కేసు నమోదుచేయాలని వారు పట్టుబట్టారు.