కర్ణాటకలో బిజెపికి మద్దతుకు జేడీఎస్ సిద్ధం!

కర్నాటక అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీకి ఏమాత్రం సంఖ్యాబలం తక్కువైనా తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీనియర్ జేడీఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ బసవరాజ్ హోరట్టి వెల్లడించారు. ముఖ్యమంత్రి యడియూరప్పను కలిసిన హోరట్టి.. మధ్యంతర ఎన్నికలను జేడీఎస్ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. 

‘బీజేపీ ప్రభుత్వం కూలిపోవడానికి కుమారస్వామి కానీ, దేవెగౌడ కానీ సుతరాము ఇష్టపడడం లేదు.. ఈ అంశాన్ని వారిచ్చిన మాట ప్రకారమే కొద్దిపాటి ఎమ్మెల్యే బలం తక్కువైన కారణంగా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే కచ్చితంగా మేము మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెడతామని స్పష్టంగా చెబుతున్నా’ అని ప్రకటించారు. 

ఎమ్మెల్యేలంతా మూడున్నర సంవత్సరాల పాటు కొనసాగాలనే కోరుకొంటున్నారని చెబుతూ దానికి తాము కట్టుబడి ఉన్నామని హోరట్టి తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తాము మూడున్నర సంవత్సరాలు కొనసాగాలి అని కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలకు చెందిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కోరుకొంటున్నారు అని స్పష్టం చేశారు. 

ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూలగొట్టాలని తాను భావించడం లేదని కుమారస్వామి ఇటీవల తెలియజేశారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కాగా, ఉప ఎన్నిక జరుగుతున్న 15 స్థానాల్లో బీజేపీ కనీసం ఆరు సీట్లు గెలిస్తే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అనర్హత వేటు పడిన 15మంది ఎమ్మెల్యేల్లో 13మంది బీజేపీ టికెట్ ఇచ్చింది. 

కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. ఈమేరకు ఉప ఎన్నికలు డిసెంబర్ ఐదో తేదీన జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే.