జలియన్ వాలాబాగ్ ట్రస్ట్ నుండి కాంగ్రెస్ కు ఉద్వాసన 

జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ (సవరణ) బిల్లు-2019ను రాజ్యసభ మంగళవారంనాడు ఆమోదించింది. సవరణ బిల్లు ప్రకారం, ట్రస్టు శాశ్వత సభ్యత్వం నుంచి కాంగ్రెస్‌ను తొలగించారు. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్టీగా కాంగ్రెస్ అధ్యక్షుడిని పేర్కొనడాన్ని కూడా ఈ బిల్లు ద్వారా తొలగించారు. 

నామినేటెడ్ సభ్యులను తొలగించే అధికారం ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి సంక్రమించింది. గత ఆగస్టులో ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వాకౌట్ మధ్య మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. 

ప్రస్తుతం జలియన్ వాలాబాగ్ మెమోరియల్ ట్రస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు, కేంద్ర సాంస్కృతిక మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, పంజాబ్ ముఖ్యమంత్రి, గవర్నర్ సభ్యులుగా ఉన్నారు. సవరణ బిల్లు ప్రకారం లోక్‌సభలో విపక్ష నేత లేని పక్షంలో, విపక్షం నుంచి ఏకైక అతిపెద్ద పార్టీ నేత ఎవరుంటే వారు ట్రస్టీ అవుతారు.