తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల కుంపటి

తెలంగాణలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు సై అనడంతో ప్రధాన ప్రతిపక్షంగా అవకాశాన్ని ఉపయోగించుకొని అధికారంలోకి రావాలని ఉబలాట పడుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కమేతీలు కలహాల కుంపటిని రాజేస్తున్నాయి. అంత అనాలోచితంగా క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా, ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేసి నాయకుల మాటల వలలో పడిపోయి పార్టీ అద్యక్షుడు రాహుల్ గాంధీ తప్పటడుగు వేసిన్నట్లు స్పష్టం అవుతుంది.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న వారు అనేకమంది ఉన్నారని అందరికి తెలిసిందే. ముందస్తు ఎన్నికల ప్రకటన వెలువడగానే విబేధాలను విస్మరించి, అందరం కలసి ముందు కెసిఆర్ ను గద్దె దింపుదాము అనే సఘీభావం అనూహ్యంగా కాంగ్రెస్ నేతలలో వెలువడింది. దీనిని అవకాశంగా తీసుకొనే, పార్టీ నేతలంత ఉమ్మడిగా ప్రచార బాధ్యతలను చేపట్టే విధంగా కమిటీల ఏర్పాటు ఉంటుందని అందరూ ఆశించారు. అయితే ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవికోసం పోటీగా ఎవ్వరు నిలబడలేని పరిస్థితి కల్పించడం కోసం పిసిసి అద్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి రాహుల్ గాంధీ శిబిరంలో తనకు గల పలుకుబడిని ఉపయోగించుకొని వ్యూహాత్మకంగా పార్టీలోని ప్రత్యర్ధులను దెబ్బ తీసారనే ప్రచారం జరుగుతున్నది. అందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ఐ ఏ ఎస్ అధికారి కె రాజు సహకారం లభించిన్నట్లు చెప్పుకొంటున్నారు.

ఈ విషయంలో కార్యనిర్వాహక అద్యక్షుడిగా ఉన్న భట్టి విక్రమార్క ను తప్ప ఉత్తమకుమార్ రెడ్డి మరేవారిని విశ్వాసంలోకి తీసుకు రాలేదని స్పష్టం అవుతున్నది. జాతీయ స్థాయి నాయకుడిగా భావించే మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, రెండు తెలుగు రాష్త్రాలలో అందరికన్నా సుదీర్ఘకాలం మంత్రిపదవులలో ఉండటమే కాకుండా, శాసన సభలో కూడా ఉంటున్న ప్రతిపక్ష నేత కే జానారెడ్డి వంటి వార్లను కుడా రాహుల్ బృందం విశ్వాసంలోకి తీసుకున్నట్లు కనబడటం లేదు.

ఎవరు ఎంతగా పట్టుబట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నా అధిష్టానం తాను అనుకున్న విధంగానే ఎన్నికల ‘సైన్యాన్ని’ఏర్పాటు చేసి, పార్టీని నట్టేట ముంచుతున్నదని ఆ పార్టీ నేతలో వాపోతున్నారు. బుధవారం ప్రకటించిన 10 కమిటీల్లో సామాజిక సమతుల్యతను పాటించడంతోపాటు కీలక నేతలు ఆశించిన పదవులను ఇవ్వకుండానే ప్రక్రియను పూర్తి చేశారు.

రాస్త్రంలో కాంగ్రెస్ సారధ్యం కోసం బహిరంగంగానే తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి కే అరుణ వంటి వార్లను నామమాత్రపు పదవులకు పరిమితం చేసారు. చివరకు సోనియా కుటుంభానికి సన్నిహితుడిగా భావించే వి హనుమంతరావును సహితం విసిరి కొట్టిన్నట్లు చేసారు. కెసిఆర్ ను ఎదిరించగల `ఫైర్ బ్రాండ్’ నేతగా పేరొందిన ఏ రేవంత్ రెడ్డికి పార్టీలో చేరే సమయంలో స్వయంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు ప్రచార కమిటీ సారధ్యం ఇవ్వనే లేదు. పైగా ఇప్పటివరకు ఒక్కరుగానే ఉన్న కార్యనిర్వాహక అద్యక్షులను ముగ్గురుగా చేసి, వారిలో ఒక్కరిగా నీయమించారు. ఆ పదవిని మొదట్లోనే రేవంత్ రెడ్డి తిరస్కరించడం తెలిసిందే.

ప్రచార కమిటీ సారధ్యం ఆశించిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి లకు అందులో స్థానమే లభించలేదు. ప్రచార కమిటీతో పాటు మేనిఫెస్టో కమిటీ బాధ్యతలను కూడా ఇద్దరు దళిత నేతలకు అప్పగించడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకొనే ప్రచారం చేసిన్నట్లు అయింది. జానారెడ్డి వంటి సీనియర్ నేతకు ఒక్క కమిటీ సారధ్య బాధ్యత కుడా అప్పగింకాహాక పోవడం గమనార్హం.

ఏఐసీసీ ప్రకటించిన 10 కమిటీల్లో కేవలం 10 మంది మహిళా నేతలకే అవకాశమిచ్చారు. ఇక సికింద్రాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరును అటు స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించకపోగా, ఏ కమిటీల్లో కూడా స్థానం కల్పించలేదు. ఇక, మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డిల పేర్లు కూడా కమిటీల్లో లేవు.

పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను నియమించకపోవడంతో వీ హనుమంతరావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు. తనకు వ్యూహ, ప్రణాళిక కమిటీ చైర్మన్‌ అవసరం లేదంటూ గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోవర్టులున్నారని హనుమంతరావు ఆరోపించారు. ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగిస్తే కేసీఆర్‌ను ఓడిస్తానని కోవర్టుల భయమని ద్వజమెత్తారు. కోవర్టుల పేర్లను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే చెబుతానని చెప్పారు.

పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ కూడా మీడియా వద్ద తమ అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి పదవి ఇవ్వడం సబబు కాదని, ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని పొంగులేటి పేర్కొన్నారు. తమకు పదవులు అవసరం లేదని, పదవులు లేకున్నా పార్టీకోసం పనిచేస్తామని డీకే అరుణ నిర్వేదంగా వ్యాఖ్యానించారు.   

కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నేరుగా రాహుల్ గాంధీని ఏమీ అనలేక రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆర్‌.సి కుంతియా రాష్ట్ర కాంగ్రెస్‌కు పట్టిన పెద్ద శని అంటూ ధ్వజమెత్తారు. కమిటీల ఏర్పాటుపై తాను ఫోన్‌లో కుంతియాను నిలదీశానని చెబుతూ పని చేసేవాళ్లను పట్టించుకోకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఎద్దేవా చేసారు.