బీజేపీ, శివసేనల విభేదాలు ఇరువురికి నష్టమే 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్‌ అధినేత డా. మోహన్ భగవత్ ఇరు పార్టీలను సున్నితంగా మందలించారు. దీర్ఘకాలం పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు ఏ అంశంపై కీచులాటలకు దిగినా అది ఇరు పార్టీలకు నష్టమని ఆయన హెచ్చరించారు. 

బీజేపీ, శివసేనల విభేదాలను ప్రస్తావిస్తూ స్వార్ధం అనేది చేటని ప్రతిఒక్కరికీ తెలిసినా చాలా కొద్ది మందే తమ స్వార్ధాన్ని విడనాడతారని అంటూ హితవు చెప్పారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ అధికార పంపకంపై బీజేపీ, శివసేనల ఘర్షణతో ఇరు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువులోగా ఏ ఒక్క పార్టీ ముందుకురాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ వ్యతిరేకించడంతో ఇరు పార్టీలతో కూడిన కూటమికి తూట్లు పడగా, తాజాగా ఎన్సీపీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.