తిరుగుబాటు ధోరణిలో శివసేన ఎమ్యెల్యేలు!

శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పార్టీలోని కనీసం సగానికి సగం మంది  ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.  బీజేపీతో కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతుండటంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల తెలుపుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానించారు.

తమవద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన సంఖ్యాబలం లేదని, తమ మిత్రపక్షమైన శివసేన కూడా సహకరించడం లేదని బీజేపీ వ్యూహాత్మకంగా గవర్నర్‌కు తేల్చి చెప్పేసింది. ఈ సమయంలో శివసేన అధిష్ఠానం ఆ పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ముంబైలోని ఓ హోటల్‌కు తరలించింది. ఈ హోటల్లోనే పార్టీ ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

చిరకాల మిత్రపక్షమైన బీజేపీని కాదని, భావజాల పరంగా వైరుద్ధ్యమున్న ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎలా కలిసి వెళ్తారని నిలదీసిన్నట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ పార్టీ అధినేతను ఈ విధంగా పార్టీ ఎమ్యెల్యేలే నిలదీసిన సందర్భం లేకపోవడం గమనార్హం. పైగా, కొన్ని రోజులు హోటల్‌లో ఉంచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలను తమతమ సొంత ఇళ్లకు ఎందుకు తరలించారని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. 

ఈ విషయంపై కూడా ఉద్ధవ్‌పై సగం మంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాకుండా ఈ విషయంపై అదే హోటల్‌లో ఎమ్మెల్యేలు ఒకరినొకరు తీవ్ర దుర్భాషలు ఆడుకోవడమే కాకుండా, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు శివసేన అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యువనేత ఆదిత్య ఠాక్రే వెంటనే ఆ హోటల్‌కు చేరుకొని ఎమ్మెల్యేలందర్నీ శాంతపరిచినట్లు తెలుస్తోంది. 

అయితే కొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా అధిష్ఠానం ముఖంపైనే కడిగేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇన్నేళ్లుగా భావజాలపరంగా తీవ్ర విభేదాలున్న పార్టీలతో మనం ఎలా కలిసి నడుస్తాం? అని ప్రశ్నించగా అధిష్ఠానం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదని ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. పైగా, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు పొత్తు పేరుతో ఆడుతున్న కపట నాటకం సహితం వారిలో అసహనాన్ని కలిగిస్తున్నది.