శివసేనకు షాకిస్తున్న పవర్, సోనియా   

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న హైడ్రామా ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమని శివసేన ప్రకటించి రోజులు గడుస్తున్నా ఆ రెండు పార్టీలు ఎటూ తేల్చకుండా కాలయాపన చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ఎదురు చూస్తున్న ఉద్ధవ్ థాకరేకు శరద్ పవర్, సోనియా గాంధీ షాక్ మీద షాక్ ఇస్తున్నారు. 

ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారికంగా తన సుముఖతను వ్యక్తం చేయలేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ఒక్కోరోజు ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చర్చించి తుది ప్రకటన చేస్తామని ప్రకటించిన శరద్ పవర్ ఈ రోజు సాయంత్రం ఆమెను కలిసి ఆ విషయమే ప్రస్తావనకు రాలేదని  చెప్పడంతో శివసేనకు తీవ్ర ఆశాభంగం కలిగింది. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపైన గానీ, శివసేన పార్టీతో పొత్తు గురించి గానీ తాము చర్చించనే లేదని ఆయన పేర్కొన్నారు. శివసేన పార్టీతో పొత్తుపై ఇవాళ ఏదో ఒకటి తేల్చేస్తారంటూ ప్రచారం జోరందుకున్న తరుణంలో పవార్ ఇలా పేర్కొనడం గమనార్హం.

‘‘మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సవివరంగా చర్చించాం. అక్కడి పరిస్థితులను ఆమెకు వివరించాను. ఏకే ఆంటోనీ కూడా ఈ భేటీలో ఉన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కొందరు నాయకులు సమావేశమై తదుపరి చర్చలు జరపనున్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని మాకు చెబుతారు...’’ అని తెలిపారు.  

కాగా శివసేన పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని సోనియా గాంధీ వ్యతిరేకిస్తున్నారా అన్న ప్రశ్నకు పవార్ స్పందిస్తూ... ‘‘ఈ సమావేశంలో అసలు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చే జరగలేదు. మరే ఇతర పార్టీతో పొత్తు గురించి కూడా ప్రస్తావనకు రాలేదు. కేవలం కాంగ్రెస్, ఎన్సీపీల గురించి చర్చించేందుకు మాత్రమే మేము సమావేశం అయ్యాం..’’ అని పవార్ స్పష్టం చేశారు. 

కాగా తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ శివసేన పేర్కొనడంపై పవార్ స్పందిస్తూ... ‘‘ఈ 170 మంది ఎమ్మెల్యేల గురించి నాకు తెలియదు. ఆ విషయం శివసేన వాళ్లనే అడగండి...’’ అని ఆయన పేర్కొన్నారు.