మీడియాపై పుష్కరాల తొక్కిసలాట నెపం

గోదావరి పుష్కర సమయంలో రాజమండ్రిలో పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట 29 మంది చనిపోవడానికి మూడేళ్ళ తర్వాత ప్రభుత్వ తప్పిదం అంటూ ఏమీ లేదని చెబుతూ ముహూర్తాలు పెట్టిన పందితులది, పుష్కరాలకు సంబంధించి విశేషంగా ప్రచారం కల్పించిన మీడియాదే పొరపాటు అంటూ విచిత్రంగా నెపం నేట్టివేస్తూ సోమయాజులు కమిషన్‌ నివేదిక తేల్చింది. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయలేదు నయం.

పుష్కరాల పవిత్రతను గాలిలోకి వదిలి వేసి దానిని ఒక ప్రచార ఆర్భాటంగా చేసి, యాత్రా కేంద్రంగా మార్చి, అనుచితంగా రాజకీయ, వినోద వేడుకల వలే మార్చివేసిన ప్రభుత్వాన్ని పొరపాటున కూడా ఒక్క మాట కూడా అనకుండా కమీషన్ జాగ్రత్త పడింది. అసలు ఆ సమయంలో, అక్కడకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు వచ్చి, పుష్కర స్నానం చేయవలసి వచ్చిందే ప్రశ్నించే సాహసం చేయలేదు.

 నివేదికలో ప్రస్తావించిన అంశాలు చూస్తే144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి హద్దుమీరిన ఉత్సాహంతో ప్రజలు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని  పేర్కొన్నారు. ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని తెలిపింది. పత్రికలు, టివి చానెళ్ళు ప్రజలలో గుడ్డి నమ్మకాన్ని కలిగించి, ప్రభుత్వాని తప్పుదోవ పట్టించారంటూ వేనుకవేసుకు వచ్చే ప్రయత్నం చేసారు. అంటే ప్రచారం చూసి ప్రభుత్వం మోసపోయినదని, వివేకాన్ని కోల్పోయినదని కమీషన్ అంగీకరించిన్నట్లు భావించాలా ?

మీడియా,  పండితుల మూఢత్వం గురించి మాత్రమే ప్రస్తావించిన కమీషన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ప్రైవేటు  ఛానల్‌కు రూ.64 లక్షలు ఇప్పించి షూటింగ్‌ కోసం సామాన్యులను నిలిపేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. గోదావరి నాలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనంత హడావిడి చంద్రబాబు ఒక్కరే చేయడంను ఈ సందర్భంగా కమీషన్ ప్రశ్నించిన్నట్లు లేదు. ముఖ్యమంత్రిని, ప్రభుత్వ యంత్రాంగం అసమర్ధతను కాపాడటం కోసం జరిగిన ప్రమాదాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం జరిగిన్నట్లు ఈ సందర్భంగా విమర్శలు చెలరేగుతున్నాయి.

కాగా, చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఉన్న కమిషన్‌తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని జగన్‌ మండిపడ్డారు.

పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే, దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవడం మరో తప్పని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పుల మీద తప్పులు చేశారని అంటూ  చంద్రబాబు చర్యల వల్లనే అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైఎస్‌ జగన్‌  విమర్శించారు.