టీఆర్ఎస్ మంత్రులూ.. సీఎంపై తిరుగుబాటు చేయండి

 తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. యాభై వేల మంది ఆర్టీసీ కార్మికుల వారి కుటుంబాలు రోడ్ల పై ఉంటే, పదుల సంఖ్యలలో కార్మికులు చనిపోతుంటే ఒక్క మాట కూడ మాట్లాడకుండ ఉంటున్న టిఆర్ఎస్ నాయకులకు సిగ్గులేదా….?అని ప్రశ్నించారు. 

నక్సలైట్లతో చర్చలు చేసిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కార్మికులతో చర్చలు జరుపడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీసేరు. ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిరుగుబాటు చేయాలని బిజెపి నేత పిలుపిచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిన హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఇప్పుడు కార్మికులు చనిపోతుంటే ఎందుకు నోరు విప్పడం లేదంటూ అడిగారు. అవకాశవాద రాజకీయాల కోసం,  ఇతర పార్టీలిచ్చే పదవుల కోసం మాత్రమే, అధికారం కోసమే తిరుగుబాటు చేస్తారా..? ప్రజాస్వామ్యంలో ప్రజలు, లక్షలాది మంది ఉద్యోగుల హక్కులు ప్రమాదంలో ఉంటే తిరుగుబాటు చేయరా…? అంటూ నిలదీశారు.

“ఆర్టీసీ కార్మికులను బహిరంగ ప్రదేశాల్లో దీక్ష చేయనివ్వడం లేదు. రోడ్లపైకి వస్తే పోలీసు జులుంతో రోడ్లన్నీ రక్తసిక్తం చేస్తున్నారు. కార్మికనేతలు  తమ సొంత ఇళ్లలో కూర్చొని నిరాహార  దీక్షలు చేసే స్వేచ్ఛ వారికి లేదా..? వాళ్ళ ఇళ్ల తలుపులు పగలగొట్టి అక్రమంగా అరెస్టులు చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు….? ఇది కేసీఆర్ మార్క్ నిరంకుశత్వం కాదా….?"అంటూ ధ్వజమెత్తారు. 

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడాలని, మేధావులు , విద్యార్థులు , ఉపాధ్యాయులు , కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళ సంఘాలు, చిత్ర పరిశ్రమ, ఇతర సంఘాలు ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని కృష్ణ సాగర్ కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వాన్ని ఖండించాలని పిలుపు నిచ్చారు.