ప్రజలపై జగన్ సర్కారు కక్ష సాధింపు

రాష్ట్రంలో అధికారంలో వున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ హయాంలో దాడులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమాలు, పోలీసు కేసులు, అవినీతి ఎలా జరిగాయో అదే దారిలో ప్రస్తుత జగన్ సర్కారు కూడా నడుస్తోందని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏమీ కనిపించడం లేదని దయ్యబట్టారు. గోరంట్ల సమీపంలోని జీనులకుంట గ్రామంలో గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు మంజూరు చేయగా అవి నిర్మాణ దశలో వుండగా వాటిని వైసీపీ ప్రభుత్వం జేసీబీ ద్వారా కూల్చివేస్తుండడం తాను కళ్లారా చూశానని తెలిపారు. నిరుపేదలకు ఏ పార్టీతో సంబంధం లేదని, 2014లో టీడీపీకి పట్టం కడితే, 2019లో వైసీపీకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. 

నాయకులకు పార్టీలు ఉండవచ్చు కానీ ప్రజలు మాత్రం ఎవరు బాగా పని చేస్తే వారికే పట్టం కడతారన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు గ్రహించాలని హితవు చెప్పారు. చేతనైతే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలేకానీ పేదలపై గూండాగిరి చేయడం పద్ధతి కాదని స్పష్టం చేశారు. అధికారులు ఇటువంటి చర్యలను ప్రోత్సహించకుండా అరికట్టాలని సూచించారు.