కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్రంపై నిందలెందుకు! 

తెలంగాణ ధనిక రాష్టమ్రని పదే పదే ప్రకటనలు చేసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై నిందలు వేయడం ఎందుకని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని పరిష్కార మార్గాలు వెతకాలని హితవు చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల పంపకాలు ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే కేంద్రం కూడా స్వాగతిస్తుందని చెప్పారు. 

ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి చర్చలు జరపాలని హితవు చెప్పారు. ఇతర అంశాల్లో కలిసి డిన్నర్లు చేసే ఈ ఇద్దరు సీఎంలు ఈ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపాలని ఆయన కోరారు. ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్టమ్రని, కాళేశ్వరం ప్రాజెక్టును సవాలుగా స్వీకరించామని చెప్పిన కేసీఆర్, కేంద్రాన్ని పదే పదే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. 

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని చెబుతూ విభజన సమయంలో పార్లమెంటులో ఉన్న కేసీఆర్ , అప్పుడు మాట్లడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమని చెబుతూ తెలంగాణలో ఇప్పటికే నిలిచిపోయిన 11 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చి పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ చెప్పలేదనని స్పష్టం చేశారు. 

కాగా, పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైన అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. 370 రద్దుతో కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెబుతూ  పార్లమెంటులో తమ ప్రభుత్వ అజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని వెల్లడించారు. విద్యావిధానం, వైద్య విధానం, నదుల అనుసంధానంపై చర్చ జరుపుతామని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు.