అశ్వత్థామరెడ్డి దీక్ష భగ్నం  

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం నుంచి తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష చేపట్టారు. 

దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయితే దీక్ష విరమణకు అశ్వత్థామరెడ్డి ససేమిరా అనడంతో పోలీసులు బలవంతంగా ఆయన దీక్షను భగ్నం చేశారు.  

ఉదయం నుంచి అశ్వత్థామరెడ్డితో పోలీసులు చర్చలు జరిపారు. అయితే ఆయన మాత్రం దీక్ష విరమించనని తేల్చి చెప్పారు. అశ్వత్థామరెడ్డితో పాటు మరో 20 మంది మహిళా కార్మికులు కూడా దీక్ష చేస్తున్నారు. వాళ్లందరికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి హెల్త్ కండీషన్ బాగోలేదని డాక్టర్లు చెప్పడంతో పోలీసులు వారందరిని అరెస్ట్ చేశారు.  

ఇలా ఉండగా, అంతకు ముందు మీర్ పేటలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని బిజెపి నేతలు పరామర్శించి సంఘీభావం త్లెఇపారు. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డిలు అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు పలికేందుకు వెళ్లగా  పోలీసులు దారి మధ్యలో అడ్డుకున్నారు. అడ్డుకున్న చోటే వివేక్, జితేందర్ నిరసన తెలిపారు. అశ్వత్థామ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని … ఉన్నతాధికారులతో మాట్లాడారు. అధికారుల సూచనతో.. పోలీసులు వివేక్, జితేందర్ లను దగ్గరుండి అశ్వత్థామరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు.