మహారాష్ట్రలో ఎవ్వరి దారి వారిదే!

మహారాష్ట్రలో ఒకవైపున ఎన్సీపీ, కాంగ్రెస్ లతో  ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనే లేదు. దానితో ఈ రోజు ఈ మూడు పార్టీలు గవర్నర్ తో జరపవలసిన భేటీ జారగనే లేదు. 

షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ మూడు పార్టీల ముఖ్యనేతలు గవర్నర్‌ను కలుసుకోవాల్సి ఉంది. అయితే, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలు సమర్పించడానికి ఇవాళే చివరి తేదీ కావడంతో ఎక్కువ మంది నేతలు ఆ పనిలో బిజీగా ఉండిపోయారు. దీంతో సమావేశం వాయిదా పడిందని చెబుతున్నారు. గవర్నర్‌తో మళ్లీ ఎప్పుడు సమవేశం ఉంటుందనేది ఇంకా నిర్ణయం కాలేదు.   

మరోవంక, సుదీర్ఘకాలం బిజెపి మిత్రపక్షంగా పార్లమెంట్ లో ఆ పార్టీతో కలసి కూర్చుంటున్న శివసేన సభ్యులు సోమవారం నుండి ప్రారంభం కానున్న సమావేశాలలో మొదటిసారిగా విడిగా కూర్చోబోతున్నారు. శనివారం జరిగిన ఎన్డీయే సమావేశానికి కూడా శివసేన సభ్యులు హాజరు కాలేదు. 

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో శివసేన  రాజ్యసభ ఎంపీలు సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్‌‌లు విపక్ష సీట్లలో కూర్చుంటారని, ఈ మేరకు సీట్ల ఏర్పాట్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. ఎగువసభలో శివసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు.  

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య ఓవైపు చర్చలు జరుగుతుండగా, మరోవైపు త్వరలో జరుగనున్న మేయర్ ఎన్నికల్లో ఆయా పార్టీల సమీకరణలు ఎలా ఉండబోతున్నాయనే అంశం కూడా తెరపైకి వచ్చింది. 

దీనిపై ఎన్‌సీపీ శనివారంనాడు స్పష్టత ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి అభ్యర్థులు బరిలోకి దిగుతారని, సొంతంగానే పోటీ ఉంటుందని ఎన్‌సీపీ ప్రతినిధి, పార్టీ ముంబై అధ్యక్షుడు నవాబ్ మలిక్ తెలిపారు. పోటీ విషయంలో శివసేనతో ఇంతవరకూ ఎలాంటి చర్చలూ జరగలేదని చెప్పారు.  

ఈనెల 22న ముంబై, థానె, పుణె, ఔరంగబాద్ సహా 27 మున్సిపాలిటీల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపల్ మేయర్ల పదవీకాలం రెండున్నరేళ్లు కాగా, గత సెప్టెంబర్‌లోనే ఈ గడువు ముగిసింది. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా మేయర్ల పదవీకాలం నవంబర్ వరకూ పొడిగించారు.