టిడిపిని కుదిపేస్తున్న వంశి వ్యవహారం 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎంపిసోడ్‌ తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. గురువారం వంశీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లను విమర్శించడం, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ను దుర్భాషలాడటం పార్టీ వర్గాలను కలవర పరుస్తున్నది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వైసిపికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరోవైపు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు వంశీ వ్యవహారంపై చర్చిం చారు. సమావేశం ముగిసిన అనంతరం స్థానిక ఎంపి కేశినేని కార్యా లయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ, జిల్లా పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి నాగుల్‌మీరా తదితరులు  గురువారం నాడు ఒక టివి ఛానల్‌లో వల్లభనని వంశీ టిడిపి నేత రాజేంద్రప్రసాద్‌ను తిట్టారని, పరుష పదజాలంతో బెదిరించారని, దీనిని ఖండిస్తున్నామని చెప్పారు. 

కేసులకు భయపడో, ప్రలోభాలకు గురయ్యో వైసిపిలోకి వంశీ వెళుతున్నాడని, అరాచకశక్తులన్నీ ఒకే గూటికి చేరుతున్నాయని విమర్శించారు. వంశీ టిడిపిలో ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించిన వీడియోను ప్రదర్శించారు. 

అయితే, వంశీ తనను నోటికొచ్చినట్టల్లా దుర్భాషలాడితే దానిపై మాట్లాడటానికి టిడిపి నేతలకు 24 గంటల సమయం పట్టిందంటూ టిడిపి ఎంఎల్‌సి బాబూ రాజేంద్రప్రసాద్‌ కినుక వహించినట్లు సమాచారం. తన సన్నిహితులతో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తీరిగ్గా ఒకరోజు తరువాత స్పందించడమేమిటని ఆయన అన్నట్లు సమాచారం. 

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్‌బాబు కూడా వంశీ వ్యాఖ్యలపై స్పందించారు. కొన్ని వెబ్‌సైట్లు లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, వాటిలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ వంశీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ ఆ వెబ్‌సైట్లతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ సిపి ద్వారాకా తిరుమలరావుకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెబ్‌సైట్ల నుంచి ఈ దుష్ప్రచారం జరుగుతోందని ప్రాథమిక సమాచారాన్ని పోలీస్‌ కమిషనర్‌కు అందజేశారు.

ఇలా ఉండగా, చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి హాజరైన మాజీ ఎంపి జెసి దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వానికి ప్రతీకార వాంఛ ఎక్కువైందని ధ్వజమెత్తారు. కొంత కాలం రవాణా వ్యాపారాన్ని మానుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. తప్పుడు కేసలు పెడుతూ వేధిస్తున్నారని, అయితే, వీటిని ఎదుర్కోవడమే మార్గమని, వంశీలాగా లొంగి పోవడం పద్దతి కాదని స్పష్టం చేశారు. జైల్లో పెట్టినా పర్లేదని నిలబడితే పోయేది ఏమీ లేదన్నారు.