కేసీఆర్ - జగన్ ల మైత్రి మూన్నాళ్ళ ముచ్చటేనా!

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్నేహంతో తమ మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన వివాదాలను ఇచ్చి, పుచ్చుకొని ధోరణిలో పరిష్కరించు కోరామని ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు,  జగన్మోహన్‌రెడ్డిలు   కలసి పలు పర్యాయాలు ప్రకటనలు చేశారు. సమాలోచనలు జరిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ సమస్యలను తామే పరిష్కరించు కొంటామంటూ ఘనంగా చెప్పుకున్నారు. 

అయితే ఈ మైత్రిని అడ్డం పెట్టుకొని అర్ధాంతరంగా హైదరాబాద్ లో తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఏపీ ప్రభుత్వం చేత ఖాళీ చేయించుకున్న కేసీఆర్, ఏపీకి సంబంధించిన ఒక్క అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించేటట్లు చేయక పోవడంతో జగన్ ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ మాయలో పది రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారనే అసంతృప్తిని సొంత పార్టీలోనే ఎదుర్కొంటున్నారు. 

ముఖ్యంగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కలసి గోదావరి జలాలను శ్రీశైలంకు మళ్లించే భారీ సాగునీటి ప్రాజెక్ట్ చేపట్టాలని మూడు సార్లు సమావేశాలు జరిపినా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. మరోవంక, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పక్రియను ఏపీ ప్రభుత్వం చేపట్టడంతో కేసీఆర్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆరు వారాలుగా తెలంగాణలో ఈ అంశంపై ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటం తెలిసిందే. 

ఈ లోగా, విభజన హామీలను తెలంగాణ ప్రభుత్వం అమలు పరచడం లేదని అంటూ ఏపీ ప్రభుత్వం నేరుగా సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ దాఖలు చేయడం కేసీఆర్ ను ఇరకాటంలో పడవేస్తున్నది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలన్న తమ వాదనకు ఏపీ వ్యతిరేకత తెలపడమే కాకుండా, ఆ ప్రాజెక్ట్ కు కేంద్రం అనుమతి ఇవ్వడం పట్లనే అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఆహ్వానంపై జగన్ పాల్గొనడం గమనార్హం. 

విభజనచట్టం హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వం బిజెపి  నేత పొంగులేటి సుధాకరరెడ్డి వేసిన పిటిషన్‌లో ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, కౌంటరును దాఖలు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రప్రభుత్వం పేర్కొన్న నియమనిబంధనలూ.. ప్రవర్తనా నియమావళిని తెలంగాణ సర్కారు పాటించడం లేదని తన అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. 9, 10 షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల పంపకానికీ సహకరించడం లేదని ఆరోపించింది. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధులలోనూ వాటాలను ఇవ్వడం లేదని వివరించింది. విభజన చట్టం హామీల అమలు కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు .. సంబంధిత శాఖలు, కార్పొరేషన్ల అధికారులు కలసి మాట్లాడుకుందామని, ఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ నుంచి సహేతుకమైన సమాధానం కానీ, సమావేశం తేదీ సమాచారంగానీ రావడం లేదని పేర్కొంది.  

రాష్ట్ర ఆర్థికసంస్థ ఆస్తుల విభజన విషయంలోనూ తెలంగాణ సహకరించడం లేదని సుప్రీం కోర్టుకు ఏపీ  ప్రభుత్వం తెలిపింది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టును నిర్మిస్తే 80 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణకు ఇవ్వాలని ఆ రాష్ట్రం చేసే వాదనలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా, విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 

కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. గోదావరినదిపై కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండానే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల 450 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వినియోగించుకోనుంది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని దిగువనున్న రైతులు నష్టపోతారని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. 

తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై 2016 సెప్టెంబరు 21న కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించినా ఎలాంటి ప్రయోజనమూ లేదు. కాళేశ్వరం నిర్మాణాన్ని రాష్ట్రం వ్యతిరేకిస్తున్నా, కేంద్ర జలమంత్రిత్వశాఖ సాంకేతిక సలహా మండలి క్లియరెన్సు ఇచ్చింని ఏపీ వాదించింది.