రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే 

రాఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేని పోని ఆరోపణలు చేసినందుకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తమ నిరసనను తెలియజేశారు.

రఫేల్ ఒప్పందంపై రాహుల్ అబద్ధాలను ప్రచారం చేశారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ నాయకత్వం వహించారు.

రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్‌ చోర్‌ హై (కాపలదారుడే దొంగ) అని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు  క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరగాయని కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేసిందని, ప్రధాన మంత్రి ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎంతమాత్రం నిజం కాదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు తర్వాత వారివి అబద్ధపు ఆరోపణలు అని తేలిపోయిందని, రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తివారీ డిమాండ్ చేశారు. 

మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని సుప్రీం తేల్చేసిందని, రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనని భూపేందర్ యాదవ్ డిమాండ్ చేశారు.