బెంగాల్‌లో ఇస్లామిక్ స్టేట్ తరహా రాజ్యం  

బెంగాల్‌లో ఇస్లామిక్ స్టేట్ తరహా రాజ్యం నడుస్తోందని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ధ్వజమెత్తారు. దంతన్ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్న బీజేపీ కార్యకర్త ఫోటోను ఆయన పోస్ట్ చేస్తూ ఆ కార్యకర్తను టీఎంసీ పార్టీ నేతలే హత్య చేశారని, ఇంత జరిగినా అధికార పార్టీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

‘‘పశ్చిమ మిడ్నాపూర్‌కు చెందిన గిరిజన బీజేపీ కార్యకర్త బర్షా హన్స్‌డాను టీఎంసీ గుండాలు ఉరి తీశారు. అత్యంత క్రూరంగా చంపేసిన ఈ రాజకీయ హత్యపై ఉదారవాదులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవే సంఘటనలు ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే ఇలాగే మౌనం దాల్చేవారా’’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఇలా అయితే ఐసిస్ రాజ్యానికి, టీఎంసీ రాజ్యానికి తేడా ఏముందని, ఇలా అయితే 2021 అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరుగుతాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకమైన కార్యకర్తలను హత్యచేయడమే టీఎంసీ ఎజేండానా? అని ఆయన ప్రశ్నించారు. 

మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ ఇన్‌చార్జీ కైలాస్ విజయ వర్గీయ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. ఒక క్రియాశీల కార్యకర్త టీఎంసీ కార్యకర్తల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆ కుటుంబానికి ఆయనే పోషకుడు’’ అని విజయ వర్గీయ ట్వీట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.