పొత్తు కుదిరింది... శివసేనకే సీఎం పదవి 

ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మూడు వారాల అనంతరం మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన నుండి ఉండేటట్లు, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి ఉండేటట్లు ఒప్పందం చేసుకున్నారు. కాగా, ఒకొక్క పార్టీ నుండి 14 మంది చొప్పున మంత్రులు ఉంటారు. 

రెండు రోజుల పాటు సమాలోచనలు అనంతరం సిద్దమైన ఈ ప్రతిపాదనలకు ఈ మూడు పార్టీల అధినేతలు ఉద్దవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, సోనియా గాంధీ అంగీకారం తెలిపారు.  మూడు పార్టీలు కలసి అధికారంలో అమలు జరపడం కోసం 40 అంశాలతో కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. 

ముఖ్యమంత్రి పదవిని శివసేనకు వదిలి వేస్తున్నట్లు చెబుతూ  'వారు (శివసేన) అవమానానికి గురయ్యారు. వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది' అని  ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ మీడియాకు తెలిపారు.

 ఇలా ఉండగా, శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ ల మధ్య కనీస ఉమ్మడి ప్రణాళికకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య జరిగే సమావేశంలో తుదిరూపు ఇచ్చి, ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే మూడు పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. పవార్ ఈ రోజు సాయంత్రం సోనియా గాంధీని ఢిల్లీలో కలువనున్నారు. 

ఇలా ఉండగా, రైతు సమస్యలపై మాట్లాడేందుకు శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ నేతలకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారిసమయం ఇచ్చినట్టు మాలిక్ చెప్పారు. ఈ మూడు పార్టీల ప్రభుత్వం పూర్తికాలంకారంలో కొనసాగగలదని శరద్ పవార్ భరోసా వ్యక్తం చేశారు.