రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభుత్వ సృష్టే 

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. గురువారం విజయవాడ ధర్నాచౌక్‌లో చంద్రబాబు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటల ఇసుక దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ఇసుక కొరత అనేది ప్రభుత్వం సృష్టించిన సమస్యే అని ధ్వజమెత్తారు. 

ప్రకృతి ప్రసాదించిన ఇసుక ప్రతి ఒక్కరి వినియోగానికి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రతీ నిర్మాణానికి ఇసుక అవసరం ఉందని, అలాంటి ఇసుకను కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఇసుక దాహానికి పేదల బతుకులు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 50 మంది చనిపోతే కేవలం ఐదుగురికే రూ. 5లక్షల పరిహారం ఇచ్చారని చెబుతూ ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలన్నింటికీ న్యాయం చేయాలని బాబు డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఎవరికైనా భరించలేని ఆవేదన వల్లే ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయన్నారు. ఇక గత్యంతరం లేదు, తాను పోతే తప్ప సమస్య తీరదు అన్న ఆవేదనతోనే ఆ ఆలోచన వస్తుందన్నారు. సెల్ఫీ వీడియోలు తీసి కార్మికులు చనిపోవడం గతంలో ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. వాళ్ల ఆవేదనకు సెల్ఫీ వీడియోలే నిదర్శనాలని తెలిపారు. ఇసుక కొరత కారణంగా 35 లక్షల మంది కార్మికులు దసరా, దీపావళి పండుగలు చేసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలను చదివించలేక, కుటుంబ సభ్యుల కడుపు నింపలేక మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు.

తాపీ కార్మికులు, తాపీ మేస్ర్తిలు, ఇటుక బట్టీల వాళ్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈ విధంగా 125 వృత్తులకు చెందిన 35 లక్షల మంది ఇసుకపై ఆధారపడి ఉన్నారని చెబుతూ లారీలు, ట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టు రంగంపై ఆధారపడ్డ వారి ఉపాధి సైతం దెబ్బతిందని పేర్కొన్నారు. స్టీల్, ఐరన్, హార్డ్‌వేర్ దుకాణాలు మూతపడ్డాయి... సిమెంట్ అమ్మకాలు పడిపోయాయి.. అనుబంధ వృత్తులన్నీ దెబ్బతిన్నాయి.. కృత్రిమ ఇసుక కొరత రాష్ట్రంలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యిందని వివరించారు. గతంలో టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక పాలసీని విమర్శించిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక మాఫీయాను తయారు చేశారని ఆరోపించారు.

ఈ రాష్ట్రాన్ని రాబందుల పాలు చేశారని మండిపడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ. 2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష వేస్తారట.. నిన్న కేబినెట్‌లో పెట్టారట.. ఒక పక్క దోచుకునేది మీరే.. మరో పక్క జరిమానాలు విధించేదీ మీరేనా.. వైసీపీ నాయకుల్లో ఎంత మందికి జరిమానా వేస్తారని ప్రశ్నించారు. బెంగళూరులో దొరికేది ఏపీ ఇసుకే, చెన్నైలో దొరికేది ఏపీ ఇసుకే, హైదరబాద్‌లో దొరికేది ఏపీ ఇసుకే, ఈ ఐదు నెలల్లో కనబడలేదా ఈ ఇసుక మాఫియా అని ప్రశ్నించారు. 

కేజీల లెక్కన ఇసుక కొనే దుస్థితి తెచ్చారని అంటూ ఇసుక దండలు వేసుకుని నిరసన తెలిపే దురవస్థ కల్పించారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతల కుటిలమైన ఆలోచనలో మార్పు రావాలి అప్పుడే కార్మికుల ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పారు. పేదలను అష్టకష్టాల పాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని అంధకారంలో ముంచుతున్నారని విమర్శించారు.