చిన్నారుల ఆరోగ్యంపై వాతావరణ ప్రభావం 

వాతావరణంలో కలిగే మార్పులు భావి తరాలపై తీవ్రప్రభావం చూపిస్తాయని, ఇది ఇలాగే కొనసాగితే ఏకంగా ఒక తరమే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ హెచ్చరించింది. ఈ ప్రభావం భారత చిన్నారులపై ఎక్కువగా ఉన్నదని చెప్పింది. దేశంలో ఆహారకొరత, అంటువ్యాధులు, వరదలు, వడగాల్పులు ఈ దుష్పరిణామాలకు కారణంగా పేర్కొంది. 

శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడే విషపూరిత వాయువులను కట్టడి చేయకపోతే పరిస్థితులు చేజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వంటి 35 అంతర్జాతీయ సంస్థలు, 120 మంది నిపుణుల ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ నివేదికను లాన్సెట్ గురువారం ప్రచురించింది.

ప్రస్తుతం వాతావరణంలోకి విడుదలవుతున్న కర్బన ఉద్గారాల మోతాదు ఇలాగే కొనసాగితే, ఇప్పుడు పుట్టిన చిన్నారి తన 71వ ఏటకు వచ్చేనాటికి వాతావరణం ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగవచ్చునని, ఇది భావి తరాలకు ఎంతో ప్రమాదకరమని హెచ్చరించింది. వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పులను 2 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించడమే ధ్యేయంగా రూపొందించిన పారిస్ ఒప్పందానికి కట్టుబడి ప్రపంచ దేశాలు ఉమ్మడి పోరు సాగించాలని నివేదిక సూచించింది.

అతిసారం, అంటువ్యాధులతో పురిట్లోనే ఎంతో మంది భారత చిన్నారులు కన్నుమూస్తున్నారు. 2015లో వేలాది మంది ప్రాణాల్ని తీసిన వడగాల్పులు వాతావరణ కాలుష్యం వల్ల రానున్న కాలంలో నిత్యకృత్యంగా మారనున్నాయి. పోషకాహార లోపం, పేదరికం, వైద్య సదుపాయాలలేమి వంటి సమస్యలతో పోరాడుతున్న భారత్.. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలకు ఎక్కువగా ప్రభావితం కానున్నది అని నివేదికను రూపొందించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన పూర్ణిమా ప్రభాకరన్ తెలిపారు.

న్యూఢిల్లీ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్‌లో ఆమె ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. చిన్నారుల్లో రోగనిరోధక శక్తి, వారి శరీరం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. దీంతో వాళ్ల ఆరోగ్యంపై వాతావరణ మార్పులు సులభంగా ప్రభావం చూపుతాయి. ఇప్పుడు పుట్టిన ప్రతీ చిన్నారి భవిష్యత్తును వాతావరణ మార్పులు నిర్ణయిస్తాయి అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగం జనాభా డెంగ్యూ సమస్యతో పోరాడుతున్నదని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగడంతో యువతలో ఆస్తమా, గుండె సమస్యలు అధికమవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 

కార్చిచ్చుల వల్ల కలిగే కాలుష్యం, వరదలు, కరువు తదితర సమస్యలతో రానున్న తరాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోనున్నట్టు నివేదిక హెచ్చరించింది. 2001-2004 మధ్య సంభవించిన కార్చిచ్చుల వల్ల ఏర్పడిన కాలుష్యానికి భారత్‌లో 2.1కోట్ల మంది, చైనాలో 1.7 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితం ఆయ్యారని, ఇండ్లు కోల్పోవడం, శ్వాస సంబంధిత సమస్యలు, మరణాలు ఇం దులో ఉన్నట్టు నివేదిక పేర్కొంది.