జగన్‌తో కలిసి నడుస్తా, వైసిపిలో చేరుతా 

వైసిపి ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, సిఎం జగన్ తో కలిసి నడుస్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని తెలిపారు. త్వరలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. 

జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అంటూ గత ఐదేళ్ల టిడిపి పాలనపై ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లానని, వాటిని సరిచేస్తానని తనకు చెప్పారని తెలిపారు.

కాగా, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుందని..చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని  విమర్శించారు. టీడీపీ తన తీరు మార్చుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని స్పష్టం చేశారు. నలభై అయిదు సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం అయిదారు నెలలు కూడా అధికారం లేకుండా ఆగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

 ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రోత్సహించాలి.  ప్రజాతీర్పును గౌరవించాలే కానీ, దాన్ని అపహాస్యం చేయకూడదని అంటూ జగన్ పాలనకు మద్దతు ప్రకటించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. అప్పుడే ధర్నాలు, దీక్షలు చేయడమేంటి?. అని ప్రశ్నించారు. 

డబ్బున్నవారి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారని, మీ పిల్లలు, నా పిల్లలు, డబ్బున్నవారందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నామని చెబతూ మరి ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ధికశక్తి లేనివారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా? అంటూ నిలదీశారు.