బీజేపీలో చేరిన 15 మంది రెబెల్ ఎమ్యెల్యేలు 

కర్ణాటర రెబల్‌ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది. దీంతో 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బిఎస్ యెడియూరప్ప సమక్షంలో బీజేపీలో చేరారు. 

వారందరికీ యెడియూరప్ప పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారికి  పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ "మాజీ ఎమ్యెల్యేలు, కాబోయే ఎమ్యెల్యేలు, కాబోయే మంత్రులకు స్వాగతం" అనడం ద్వారా వారందరికీ మంత్రిపదవులు ఖాయం అనే సంకేతం ఇచ్చారు. ఉప ఎన్నికలు జరుగుతున్న మొత్తం 15 స్థానాలను గెలుపొందగలమనే భరోసాను వ్యక్తం చేశారు. 

డిసెంబర్‌ 5న 15 స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో వీరంతా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ 17 మంది ఎమ్మెల్యేలు కారణమయ్యారు. మరో రెండు సీట్లకు సంబంధించిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానాలలో ఎలక్షన్‌ కమిషన్‌ ఎన్నికలు నిర్వహించడం లేదు.  

మరోవంక ఉపఎన్నికలు జరుగుతున్న 15 స్థానాలకు గాను 13 చోట్ల పార్టీ అభ్యర్థులతో తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. వీరంతా రెబెల్ ఎమ్యెల్యేలు కావడం గమనార్హం.