టీడీపీకి దేవినేని అవినాశ్ రాజీనామా...వైసిపిలో చేరిక 

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాశ్ రాజీనామా చేశారు. అవినాశ్ తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. అవినాశ్‌తో పాటు సీనియర్ నేత కడియాల బచ్చిబాబు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. తర్వాత కొద్దిసేపటికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 

అవినాష్‌‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. ‘‘పార్టీలో చేరినప్పటి నుంచి అధినాయకుడి మాటే నా బాట అని.. చాలా నిబద్ధతతో పనిచేశాను. కృష్ణా జిల్లాలో మా నాయకులు, కార్యకర్తలను వినియోగించుకోవడంలో టీడీపీ విఫలమైంది. కార్యకర్తలకు సముచితస్థానం కల్పించాలని చంద్రబాబును కోరాను. ఎన్నికల్లో నాకు అనువైన స్థానం కాకపోయినా.. మీ ఆదేశాల మేరకు గుడివాడ నుంచి పోటీ చేశాను. ఓటమి బాధ కలిగించినా పార్టీ కోసం ముందడుగు వేశాను. కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం బాధ కలిగించింది. కొందరు స్థానిక నేతలు కావాలని ఇదంతా చేస్తున్నా.. అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు’’ అని రాజీనామా లేఖలో దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు. 

విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్ రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తండ్రీకొడుకులిద్దరూ టీడీపీలో చేరారు. నెహ్రూ మరణం తర్వాత అవినాష్‌కు చంద్రబాబు అండా నిలబడ్డారు. అంతేకాదు తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు.

2019 ఎన్నికల్లో గుడివాడ నుంచి అవినాష్ టీడీపీ తరుపున పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి కొడాని నాని చేతితో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో అవినాష్ పార్టీ మారుతున్నట్లు అనేక పుకార్లు వచ్చాయి. వాటిని ఆయన తిప్పికొట్టారు. ఇప్పుడు అదే పుకార్లను నిజం చేస్తూ వైసీపీలో చేరడం చర్చనీయాంశమైంది.