సీఎం పదవిపై శివసేనతో ఒప్పందం లేనేలేదు 

మహారాష్ట్రలో ప్రభుత్వం  ఏర్పాటుపై శివసేన ముందుంచిన డిమాండ్లు తమకు సమ్మతం కావని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై శివసేనతో ఏర్పడిన విబేధాల గురించి తొలిసారిగా స్పందిస్తూ ఎన్నికలకు ముందే ప్రధాని మోదీ, తాను అనేకసార్లు బహిరంగ సభల్లో కూటమి విజయం సాధిస్తే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించామని గుర్తు చేశారు. 

అప్పడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు కొత్త డిమాండ్లతో వారు (శివసేన) ముందుకు వచ్చారని అమిత్ షా విస్మయం వ్యక్తం చేశారు. శివసేన కొత్త డిమాండ్లకు తాము తలొగ్గనందునే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం పదవిని పంచుకోవాలనే విషయమై ఎన్నికల ముందు శివసేనతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని  తేల్చి చెప్పారు. 

 కాగా, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు గురించి మాట్లాడుతూ గవర్నర్ అన్నిపార్టీలకు చాలా సమయం ఇచ్చారని, ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదని చెప్పారు. గవర్నర్ 18 రోజుల పాటు అన్ని పార్టీలకు సమయం ఇచ్చారని గుర్తు చేశారు. ఏ రాష్ట్రానికి ఇన్ని రోజులు సమయం ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పటికీ ఆయా పార్టీలకు 6 నెలల గడవు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ దిశగా కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) రూపకల్పనపై పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పృధ్వీరాజ్‌ చవాన్‌ వెల్లడించారు. ముసాయిదా సీఎంపీని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేలు ఆమోదించిన తర్వాత ఈ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని చెప్పారు.

మధ్యాహ్నం ఈ విషయమై శివసేన, కాంగ్రెస్ నేతలు సమాలోచనలు జరుపగా, సాయంత్రం జరుగవలసిన ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల సమావేశం అర్ధాంతరంగా రద్దయింది. అందుకు ఎటువంటి కారణాలు చెప్పనే లేదు.