బీజేపీలో చేరనున్న కర్ణాటక రెబెల్ ఎమ్యెల్యేలు 

అనర్హత వేటుపడిన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రెబల్ ఎమ్మెల్యేలంతా గురువారంనాడు బీజేపీలో చేరనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. 

బీజేపీలో చేరేందుకు వారు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ పార్టీ సీనియర్ నాయకులను కలిశారని పార్టీ వర్గాలు నిర్ధారించాయి.  సీఎం యడియూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నలిన్ కుమార్ కతిల్ సమక్షంలో రేపు ఉదయం 10.30 గంటలను పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.    

ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాటి స్పీకర్ రమేష్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. సభాకాలం ముగిసే వరకూ 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ నిషేధం విధించారు. 

దీనిని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో సవాలు చేయగా, వారిపై స్పీకర్ అనర్హత వేటను అత్యున్నత న్యాయస్థానం తాజా తీర్పులో సమర్ధించింది. అయితే, ఎన్నికల్లో పోటీ చేయరాదనే  స్పీకర్ ఆదేశం చెల్లదని కోర్టు తీర్పుచెప్పింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వీరంతా బీజేపీలో చేరి..ఉప ఎన్నికల్లో తిరిగి టిక్కెట్ ఆశిస్తున్నారు.