ఉప రాష్ట్రపతికి సీఎం క్షమాపణ చెప్పాలి

దశాబ్దాలుగా తెలుగుభాషకు ప్రాచీన హోదాకై పోరాడి సాధించుకున్నామని, అయితే నేడు రాష్ట్రప్రభుత్వ చర్యల వల్ల తెలుగుభాష మరుగున పడే ప్రమాదం పొంచి ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో వెంకయ్య నాయుడి పాత్ర ఎనలేనిదని, మాతృభాషలోనే బోధన ఉండాలని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వెంకయ్య సూచించారని పేర్కొన్నారు. అయితే ఉప రాష్టప్రతి హోదాలో ఉన్న వెంకయ్యను దూషించేలా సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే ఉప రాష్టప్రతికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన పట్ల అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహనరెడ్డి విమర్శలు చేసిన సంగతి మరచినట్లున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు వ్యతిరేకించిన జగన్ ఇప్పుడు ఎలా ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. 

రాష్ట్రంలో ఇసుక కొరత ఇంకా తీరలేదంటూ, మద్యం పాలసీని వెంటనే అమలు చేసిన ప్రభుత్వం ఇసుక పాలసీలో ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న రహస్య ఎజెండా ఏమిటో ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరత తీరకుండానే సిమెంటు ధరను పెంచి సామాన్యులపై మరింత భారాన్ని మోపారని విమర్శించారు. 

బీజేపీ ప్రజల పక్షాన ఎప్పుడూ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని, ఈనెల 14వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విజయవాడలో జరుప తలపెట్టిన ఇసుక దీక్షకు ఆ పార్టీ నేతలు మద్దతు కోరగా, తాము అంగీకరించామని స్పష్టం చేశారు.