ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఫడ్నవీస్ ధీమా 

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు నిస్సహాయత వ్యక్తం చేసిన రెండు రోజులకే ఆయన ఈ విషయమై విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. 

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరమని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరి మద్దతుతో అనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.

మరోవైపు బీజేపీ సీనియర్ నేత నారాయణ్ రాణే కూడా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని విలేకరుల సమావేశంలో చెప్పారు. అంతేకాదు శివసేనను కాంగ్రెస్-ఎన్సీపీ ఆట పట్టిస్తున్నాయని పేర్కొనడం గమనార్హం. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో శివసేన జత కట్టకపోవచ్చని తెలుస్తోందని చెప్పారు.

ఎన్సీపీ-కాంగ్రెస్ తనకు మద్దతిస్తాయని కలలు కన్న శివసేనకు వారు మద్దతివ్వకపోయేసరికి జ్ఞానోదయం అయింది. అటు ఎన్సీపీ-కాంగ్రెస్ శివసేనతో చేతులు కలిపేందుకు సందేహించేసరికి మళ్లీ బీజేపీ రంగంలోకి దిగింది. మరోవంక, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సహితం తాను బిజెపిని శత్రువుగా భావించడం లేదని చెబుతూ ఆ పార్టీ ముందుకు వస్తే సమాలోచనలు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు.