రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రి మెచ్చుకోలేదు

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ పథకాలను క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొంటే, అందుకు భిన్నంగా తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రి మెచ్చుకున్నట్టు పత్రికల్లో రావడంపై బీజేపీ వివరణ ఇచ్చింది. 

కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సీఎం సీపీఆర్‌ఓ అనైతికంగా దిగజారి, కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేయడం సరైంది కాదని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ప్రకాశ్ రెడ్డి హితవు చెప్పారు. 

కేంద్ర మంత్రి మీడియాతో గానీ, సీఎంను కలిసినపుడు గానీ, ఎక్కడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను మెచ్చుకోలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న అబద్దాలను కేంద్ర మంత్రి గ్రహించి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని మాత్రమే చెప్పారని ప్రకాశ్‌రెడ్డి వివరించారు. బీజేపీ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని గ్రహించి సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా అనేకసార్లు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రశంసించినట్టు పత్రికల్లో కథనాలు రాయించుకున్నారని, అయితే ప్రత్యక్షంగా రాష్ట్రప్రభుత్వ పథకాలను మెచ్చుకున్న సందర్భాలే లేవని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా ఒక్క ఎకరాకు నీరు అందించకపోయినా అవినీతి మాత్రం ఏరులై పారుతోందని, మిషన్‌భగీరధ ద్వారా 2017లోపు ఇంటింటికీ నీరు ఇవ్వకుంటే మళ్లీ ఓట్లు అడగనని చెప్పి సీఎం నీళ్లు ఇవ్వకుండానే ఎన్నికల్లో ఓట్లు అడిగారని ఎద్దేవా చేశారు. 

అవినీతి, అక్రమాలు, అబద్దాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం నిత్యకృత్యాలయ్యాయని చెప్పారు. కాగ్ కూడా మిషన్ భగరీధ, మిషన్ కాకతీయ పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నదని గుర్తు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీస మర్యాదలకు తిలోదకాలు ఇచ్చి కేంద్ర మంత్రులు రాష్ట్ర పథకాలను ప్రశంసించినట్టు తప్పుడు ప్రచారం చేసుకోవడం చాలా దారుణమని మండిపడ్డాయిరు. 

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాలనే లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనే పథకాన్ని, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతా ఉండాలనే పథకాలతో పాటు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా గృహనిర్మాణాలను చేపడుతోందని, అయితే  ఈ పథకాలకు అవసరమైన రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు.