శివసేనకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్ 

మహారాష్ట్రలో సోమవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ నిస్సహాయత వ్యక్తం చేయడంతో శివసేన ముందుకు వచ్చింది. ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా పావులు కదపటం ప్రారంభించింది. అయితే ఆ రెండు పార్టీలు ఎటు తేల్చకుండా, గడువు లోగా మద్దతు లేఖలు ఇవ్వకుండా శివసేన నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 

శివసేన, ఎన్సీపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బైటనుండి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ సంకేతాలు పంపుతున్నా ఎటూ తేల్చి చెప్పకుండా కాలయాపన చేస్తుండడంతో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీఇచ్చిన 24 గంటల గడువులోగా ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధతను తెలపలేక పోయింది. అయితే కాంగ్రెస్ బయట నుండి మద్దతు కాకుండా ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ప్రభుత్వంలో చేరాలని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ స్పష్టం చేస్తున్నారు. 

ప్రభుత్వం ఏర్పాటుకు మరో రెండు రోజుల వ్యవధి కావాలని శివసేన చేసిన వినతిని గవర్నర్ తిరస్కరించారు. వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 8.30 గంటల వరకు గడువు ఇచ్చారు. ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ ఆహ్వా నించిన నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రంగంలోకి దిగారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇంటికి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేసి మద్దతు కోరారు. 

కూటమి ఏర్పడితే ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుతారని, ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెరో డిప్యూటీ సీఎం పదవులు ఇస్తారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరని పక్షంలో స్పీకర్ పదవి ఇస్తారని చెబుతున్నారు.  గవర్నర్ విధించిన గడువు రాత్రి 7:30 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పలువురు నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని, అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు లేఖలు అందించేందుకు సమయం ఇవ్వాలని కోరగా, గవర్నర్ కోశ్యారీ తిరస్కరించారు. 

అనంతరం ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. శివసేన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశాం. మాకు ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రాథమికంగా మద్దతు తెలుపుతున్నాయని చెప్పాం. చర్చల ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు పార్టీలు మరికొంత సమయం కోరాయి. ఇదే విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసి, కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని కోరాం. కానీ ఆయన తిరస్కరించారు అని పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు కొనసాగిస్తామని, గవర్నర్ గడువు ఇవ్వకపోవడంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని శివసేన తెలిపింది. ఇదే సమయంలో,  శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఛాతినొప్పితో దవాఖానలో చేరారు. ఆంజియోప్లాస్టీ చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. మరోవంక, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న శివసేన ఆశలపై కాంగ్రెస్ చివరి క్షణంలో నీళ్లు కుమ్మరించింది. 

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఆమె నివాసంలో పార్టీ వర్కింగ్ కమిటీ రెండుసార్లు సమావేశమైంది.  మద్దతు లేఖ ఇవ్వకపోగా, గడువు ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఎన్సీపీతో మరింత విపులంగా చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయించింది అని కాంగ్రెస్  ప్రకటన విడుదల చేయడంతో శివసేనకు ఊహించని దెబ్బ తగిలింది.

శివసేన, కాంగ్రెస్ మధ్య దశాబ్దాలుగా సైద్ధాంతిక శత్రుత్వం ఉండటం, ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పొత్తుపై సోనియాగాంధీ నిర్ణయాన్ని వెల్లడించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని బీజేపీ తెలిపింది. 

శివసేన విఫలం కావడంతో ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఎన్సీపీకి చేరింది. గవర్నర్ కోశ్యారీ తనకు ఫోన్ చేసి రమ్మన్నారని ఆ పార్టీ నేత అజిత్ పవార్ తెలిపారు. దాదాపు రాత్రి 8:30 గంటల సమయంలో అజిత్‌పవార్ బృందం గవర్నర్‌ను కలిసింది. గవర్నర్ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం అని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.  ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు మద్దతు ఇస్తున్నామని చెప్తూనే.. వ్యూహాత్మకంగా చివరిక్షణం వరకూ మద్దతు లేఖను అందించలేదు.  

ఇలా ఉండగా,  బీజేపీ-శివసేన మధ్య 30 ఏండ్లుగా కొనసాగుతున్న స్నేహబంధం సోమవారంతో ముగిసినట్టయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో చర్చలు జరుపడం, కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ రాజీనామా చేయడం వంటి పరిణామాలు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.