ఎన్డీయేకు శివసేన గుడ్‌బై.. కేంద్రమంత్రి రాజీనామా

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న శివసేన  కేంద్ర పదవుల్లోని తమ నాయకుల చేత రాజీనామా చేపిస్తోంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. 

దీంతో ముంబైతో పాటు ఢిల్లీ రాజకీయాలు సైతం ఒక్కసారిగా వేడెక్కాయి. అలాగే రాష్ట్రంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని  ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ షరతు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పవార్‌ షరతుకు స్పందించిన శివసేన ఆదివారం అర్థరాత్రి వరకు పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపింది. 

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, పలువురు సీనియర్లతో చర్చించారు. చివరికి వారి అంగీకారంతోనే పదవులకు రాజీనామా చేస్తున్నారు. అలాగే తాము ఎన్డీయే కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు త్వరలోనే శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటిస్తారని తెలుస్తున్నది.  

శివసేన–ఎన్సీపీ సంకీర్ణానికి కాంగ్రెస్‌ మద్దతిచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జైపూర్‌లో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభ్యులు అంతిమ నిర్ణయాన్ని సోనియా గాంధీకి వదిలివేసేందుకు ఆమోదం తెలిపారు. ఎన్సీపీ చీఫ్‌ పవార్‌ మంగళవారం తమ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం సోనియాతో సమావేశం కానున్నారు. ఆమెతో భేటీ అనంతరమే తమ నిర్ణయం తెలుపుతామని పవార్‌ ప్రకటించారు. 

దీంతో అందరీ కళ్లు కాంగ్రెస్‌ వైపు మళ్లాయి. అయితే, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భాగస్వామ్య పక్షాలతో సాధారణంగా తలెత్తే విభేదాల కారణంగా తమ ఎమ్మెల్యేలు ప్రతిపక్షం వలలో పడే అవకాశముందని కర్ణాటక అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కాంగ్రెస్‌ భయపడుతోంది. సంకీర్ణంలో భాగస్వామి అవుతుందా? లేక బయటి నుంచి మద్దతిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిర్ణయంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.