అక్టోబర్ నుంచి ఇంటింటికీ బీజేపీ

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అక్టోబర్ నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కాకినాడలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సమావేశంలో  ముఖ్య అతిథిగా పాల్గొంటూ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి మంజూరుచేస్తోందని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కనీసం మూడు పథకాల వివరాలను చెప్పగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. చంద్రబాబు కావాలనే ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెబుతూ అందులో భాగంగానే గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు,

రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణాభివృద్ధి శాఖలను ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులే నిర్వహిస్తున్నారని గుర్తు చేస్తూ కేంద్రం నుండి వస్తున్నా భారీ నిధుల కారణంగా ఇక్కడ వారు విశేష ప్రచారం పొందే ప్రచారం చేసుకొంటున్నారని ఎద్దేవా చేసారు.

రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా, భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, వీటన్నిటికీ ఎమ్మెల్యేలు పాత్రధారులు కాగా చంద్రబాబు సూత్రధారి అని విమర్శించారు. 2010లో బాబ్లీ ఘటన జరిగి, అప్పటి నుండి 37 సమన్లకు స్పందించకపోవడంతో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీచేస్తే, దాని వెనక ప్రధాని మోదీ ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయ స్థానం ఆదేశాలను ఖాతరు చేయని చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదని కన్నా స్పష్టం చేసారు.

బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దేవదర్ మాట్లాడుతూ కేంద్రం నుండి నిధులు తెచ్చుకుని చంద్రబాబు చందాల బాబుగా మారారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు. అమరావతిలో రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించి, ఇపుడా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పని లేని టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీల్లో నియమించి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మన ఓట్లు మన పార్టీకే వేసుకోవాలని, వైసీపీ వైపు ఓట్లు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ రైతులు తమ పంటలకు సాగునీరు, గిట్టుబాటు ధర మాత్రమే అడుగుతారని, అవి కూడా సమకూర్చలేని స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందని విరుచుకు పడ్డారు. రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ ఇపుడు రాళ్ళ సీమగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. గాలేరు, హంద్రీనీవా పథకాలను ప్రభుత్వం పూర్తిచేయకుండా తీవ్ర తాత్సారం వహిస్తోందని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తివిరుద్ధ పార్టీలని, కేవలం మోదీని ఓడించడం కోసమే ఆ రెండు పార్టీలూ జత కట్టాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నిధులు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివని వ్యాఖ్యానించారు. సభకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. అఖిల భారత కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కే సుగుణాకరరావు, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు.