చంద్రబాబు మంత్రివర్గం విస్తరణ

2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. హజ్ యాత్రకు వేడుతున్న మొదటి బృందం కలసిన సందర్భంగా ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం కల్పించవలసి ఉన్నదని స్వయంగా ఆయనే చెప్పడంతో ఈ విషయమై ఉహాగానాలు బయలుదేరాయి. అదే జరిగితే ఈ నెల 28న గుంటూరులో జరుపనున్న ముస్లిం సదస్సుకు ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు దేశం పార్టీ ఎన్డియే నుండి వైదొలగడంతో బిజెపికి చెందిన ఇద్దరు – కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావు రాష్త్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేసారు. ఆ రెండు పదవులను ఇప్పుడు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మంత్రులు ఎవ్వరిని తొలగించే అవకాశం లేకపోయినా కొందరి శాఖలను మార్చవచ్చని అనుకొంటున్నారు.

ప్రస్తుతం శాశానమండలి చైర్మన్ గా ఉన్న మొహమ్మద్ ఫరూక్ ను మంత్రివర్గంలోకి తీసుకో గలరని చెబుతున్నారు. మరో ఇద్దరు కుడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక ఎస్టి ల నుండి కుడా ఒకరికి మంత్రి పదవి లభించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ఈ రెండు వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గత ఎన్నికలలో ఈ రెండు వర్గాల నుండి తెలుగు దేశం పార్టీకి చెప్పుకోదగిన మద్దతు లభించ లేదు.

అయితే గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన బిజెపి, జనసేన దూరం కావడంతో గండి పడే వోట్లను ఈ రెండు వర్గాలను దగ్గరకు తీసుకోవడం ద్వారా భర్తీ చేసుకోవడం కోసం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు.