కోర్టు మొట్టికాయలు వేసినా పట్టనట్టుంది

ఆర్టీసీ కార్మికులు, వారి పోరాటానికి మద్దతిస్తోన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా కె. లక్ష్మణ్ విమర్శించారు.  ఆర్టీసీ సమ్మె విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం మాత్రం అవేవీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. 

ఆర్టీసీ ఆస్తులపై టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు కన్నేశారని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కుట్రలో భాగంగానే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చించాల్సింది పోయి,  సీఎం కేసీఆర్ వారి పట్ల బెదిరింపు ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారంటూ వారి ఉద్యోగాలపై వేటు వేయడమే కాకుండా జీతాలివ్వక వేధిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. 

సామాన్యుడి రావాణా సాధనంగా పేరుగాంచిన ఆర్టీసీ బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా..  టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందని,  తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని లక్ష్మణ్ దయ్యబట్టారు.  కోర్టు చీవాట్లు పెట్టినా,  ఆర్టీసీ కార్మికులు అలుపెరగకుండా ఉద్యమించినా.,  బస్సుల్లేక ప్రజలు అనేక కష్టాలకు గురవుతున్నా  ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. 

ఈ నేపథ్యంలో మొద్దునిద్ర పోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు రేపు (నవంబర్ 9న) హైదరాబాద్ ట్యాంక్ బండ్ నందు ఆర్టీసీ జేఏసీ నిర్వహిస్తోన్నమిలియన్ మార్చ్ కు బీజేపీ తెలంగాణ పూర్తి మద్దతునిస్తుందని లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిపిపిచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి 35 రోజులుగా ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలని కోరారు.