సోనియా, రాహుల్ లకు ఎస్పీజీ భద్రత తొలగింపు 

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక వాద్రాలకు ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోనియా, రాహుల్‌, ప్రియాంకకు ఇక నుంచి జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించనున్నారు. 

ఈ ముగ్గురి భద్రతపై ఇటీవల జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో చర్చించారు. ఆ నివేదిక ప్రకారమే వారికి ఎస్పీజీ భద్రత తొలగించినట్లు సమాచారం. వీరి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావిస్తోన్న కేంద్రం.. ఎస్పీజీని తొలగించి జెడ్‌ప్లస్‌ భద్రతను కల్పించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 

జడ్ ప్లస్ భద్రతను సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) పర్యవేక్షించనున్నది.ఈ ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా ఎస్పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు.  

ఎస్పీజీ భద్రతను కేవలం రాష్ట్రపతి, దేశ ప్రధానికి మాత్రమే కేటాయిస్తారని, ఇతర నేతలకు అవసరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఎస్పీజీ చట్టానికి ఆ మేరకు  సవరణ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దాని కొరకు త్వరలోనే పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు.