దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా 

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. ఫడ్నవిస్ సారధ్యంలోని గత ఐదేళ్ల ప్రభుత్వ పదవీకాలం ఇవాల్టితో పూర్తి కావడంతో పదవికి ఆయన రాజీనామా చేశారు. మధ్యాహ్నం 4.15 గంటల ప్రాంతంలో ఫడ్నవిస్ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలుసుకొని రాజీనామా పత్రం సమర్పించారు. 

అనంతరం మీడియాతో ఫడ్నవిస్ మాట్లాడుతూ, తన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు చెప్పారు. మరో ఏర్పాటు జరిగేవరకు అధికారమలో కొనసాగమని కోరారని తెలిపారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాని, ప్రభుత్వం ఏర్పాటుకు తమ ప్రయత్నం కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

గత ఐదేళ్ల పాలనలో తనకు సహకరించిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పనిచేసిందని, రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. బీజేపీ-శివసేన కూటమిని ప్రజలు మరోసారి ఎన్నుకున్నారని చెబుతూ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పారు.

ఇలా ఉండగా, బిజెపి-శివసేన కూటమికి ప్రజలు స్పష్టమైన ఆధిక్యత ఇచ్చినా పక్షం రోజులుగా ప్రభుత్వం ఏర్పాటుకు మోకాలడ్డుతూ వస్తున్న శివసేన నేతల వైఖరిని మొదటిసారిగా ముఖ్యమంత్రి ఎండగట్టారు. ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన తమను సంప్రదించలేదని, తన కాల్స్‌కు కూడా ఉద్ధవ్ థాక్రే స్పందించలేదని ఫడ్నవిస్ చెప్పారు. ప్రతిపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు జరపడానికి తీరిక ఉన్న శివసేన నేతలకు సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న తమతో మాట్లాడానికి మాత్రం విముఖత చూపుతూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. 

పైగా, శివసేన పట్టుబడుతున్న 50-50 ఫార్ములా గురించి తనకు తెలియదని ఆయన కుండబద్ధలు కొట్టారు. బీజేపీ ఎవరినీ, ఎప్పుడూ తప్పుదారి పట్టించలేదని, శివసేనే  అయోమయ వైఖరితో ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుపై శివసేన తనను సంప్రదించలేదని చెబుతూ  తాను ఫోను చేసినా ఉద్ధవ్ స్పందించలేదని కూడా ఆయన చెప్పారు. ఉద్ధవ్‌కు సమయం లేకపోయిన పక్షంలో ఫోనైనా చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. 

బాల్‌థాకరే అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే శివసేన నేతలు మాత్రం బాధ్యతారాహిత్యంతో  ప్రధాని మోదీపై లెక్కలేనని ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు.  ప్రధానిపై శివసేన చేసినన్ని ఆరోపణలు కాంగ్రెస్ నైతలు సైతం చేయలేదంటూ శివసేన వైఖరిపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వంపై ఏర్పాటు విషయంలో జరుగుతున్న జాప్యానికి తాను కారణం కాదని కూడా ఆయన తేల్చిచెప్పారు.

ఏదైమైనా మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉందని ఫడ్నవిస్ నొక్కిచెప్పారు. ఇలా ఉండగా, ఈ ఐదేళ్లు రైతుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాం. ప్రభుత్వాన్ని స్వచ్ఛంగా నడిపించామని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం. వాటిని సమర్థంగా పరిష్కరించామని ఫడ్నవిస్ సంతృప్తి వ్యక్తం చేశారు.  ఐదేళ్లుగా జరిగిన అభివృద్ధి చాలా సంతోషం కలిగించింది. మేం చేసిన పనులతో ప్రజలు సంతృప్తి చెందారు కనుకే మళ్లీ ఆశీర్వదించారని సంతృప్తి వ్యక్తం చేశారు.