కేంద్రం మాటతో షాక్‌లో కేసీఆర్, జగన్!

కేంద్రంతో సంబంధం లేకుండా హల్ చల్ చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ఐదు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం ఒకే మాటతో గండి కొట్టింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోకుండా కాలయాపన చేయడాన్ని బహిర్గతం చేసింది. 

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయమై హై కోర్ట్, కేంద్ర ప్రభుత్వంలతో సంబంధం లేకుండా నెలరోజులకు పైగా ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వైఖరిని నిలదీస్తూ ఆర్టీసీపై సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు లో కేంద్రం వెల్లడి చేసింది. దానితో ఇద్దరు ముఖ్యమంత్రులు ఖంగు తిన్నారు. 

ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు అంతా మేమే, మా ఇష్టం కదా… మా సామ్రాజ్యాలు అనుకుంటున్న దశలో హైకోర్టులో ఆర్టీసీపై కేంద్రం చేసిన వాదనతో రెండు ప్రభుత్వాలకు షాక్ కు గురైనంత పనిచేసింది. షెడ్యూల్‌-9 సంస్థలు కాబట్టి… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పంచుకుంటే సరిపోతుంది కదా, మన ఆస్తుల్లో కేంద్రానికి ఏం సంబంధం అన్నట్లు వీరిద్దరూ వ్యవహరించారు. 

ఏ రాష్ట్రంలో ఆస్తులు వారికి, బస్సుల పంపకాలు… ఆస్తుల పంపకాలు ముగిసాయి. అందుకే ఏపీలో జగన్‌ తన హమీ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని వీలినం చేస్తానని ఉత్తరువులు ఇచ్చేసారు. అదే తెలంగాణలో ఆర్టీసీ నష్టాల్లో ఉంది కాబట్టి నేను ప్రైవేటుకు ఇచ్చేస్తా అంటూ కేసీఆర్ ప్రకటించేశారు. కార్మికులు సమ్మెకు వెళ్తే… కోర్టులు కొడుతాయా అంటూ వెటకారంగా మాట్లాడారు.

కానీ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంలో… ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో మాకు 33శాతం వాటా ఉంది. మేము ఇంతవరకు విభజనకు ఓకే  చెప్పనే లేదు, మేము సరే అనకుండా… ఎలా విభజిస్తారు అని కేంద్రం ప్రశ్నించింది. ఇన్నాళ్లు మౌనంగా ఉండి, చివరి నిమిషంలో తాము అనుమతి ఇవ్వలేదని, తమ దృష్టిలో ఆర్టీసీ విభజనే జరగలేదని కేంద్రం  అనటంతో ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చింది.

ఇప్పటికైనా కేసీఆర్ ఏకపక్ష ధోరణులను, మొండి వైఖరిని విడనాడి బాధ్యతాయుతంగా వ్యవహరింప వలసి ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయవలసి ఉంది. 

ఇలా ఉండగా, తెలంగాణ మంత్రివర్గం 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులను నడపాలని తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ రావ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని నిలిపి వేయాలని పిటిషనర్ కోరారు. 

ఆ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రభుత్వ వాదనతో అసంతృప్తి చెంది.. 5100 రూట్ల ప్రైవేటీకరణకు స్టే విధించింది. అలాగే తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది.