పోలవరంలో ప్రచార ఆర్భాటాలే...గడువులో పూర్తి అసాధ్యం

పోలవరం ప్రాజెక్టును ఒక పిక్నిక్ స్పాట్ గా మార్చివేసి, ప్రతి రోజు సమీక్షలు, సందర్శనలు అంటూ హడావుడి చేస్తూ, కేంద్రం సహకరించక పోయినా చెప్పిన మాట ప్రకారం 2019 ఎన్నికల లోపు పూర్తి చేస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం ప్రచార ఆర్భాటాలు చేయడమే గాని, అక్కడ జరుగుతున్నది మాత్రం చాల స్వల్పమని స్పష్టం అవుతున్నది. కేవలం కాంట్రాక్టర్లతో లాభసాటి బేరసారాలకు అనువైన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణం పట్లనే దృష్టి కేంద్రీకరిస్తూ మిగిలిన అనేక అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని వెల్లడి అవుతున్నది. 

2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా అది అంత తేలికకాదని, దుస్సాహసమని కాగ్‌ పేర్కొనడం గమనార్హం. అసలు 52 శాతం ముంపు గ్రామాల నిర్వాసితుల తరలింపునకు ప్రభుత్వం వద్ద ప్రణాళికే లేదని, భూ సేకరణా చేయలేదని, కనీస సంప్రదింపులు కుడా చేపట్టలేదని వెల్లడించింది. ప్రాజెక్టు పునరావాస కుటుంబాలకు అవసరమైన 26,830 ఎకరాల భూమిని ఇంతవరకు సేకరించలేదని కాగ్‌ నివేదికలో పేర్కొంది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రంగంపై కాగ్‌ రూపొందించిన నాలుగో నివేదికను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నివేదికలో పేర్కొన్న పలు అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, దుబారా, నిర్వాసితులంటే లెక్కలేనితనం స్పష్టమయ్యాయి. పునరావాసంపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని స్పష్టం చేసింది.

చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు 2019 నాటికి ప్రాజెక్టు నిజంగానే పూర్తయితే సుమారు 90 వేల కుటుంబాలు కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రాజెక్టు డిజైన్ల విషయంలో జాప్యం, ఇష్టారీతిన టెండర్లు కేటాయించడం వల్ల దుబారా ఎక్కువగా ఉందని తేల్చింది. పనులు జరగకపోయినా లిక్విడేషన్‌ డామేజీ విధించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.

ప్రాజెక్టు కింద 1,05,601 కుటుంబాలు ప్రభావితమవుతాయని అంచనా వేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ డిపార్టుమెంటు మాత్రం ఆడిట్‌ జరిగే నాటికి 4,069(4శాతం) కుటుంబాలకు మాత్రమే పునారావాసం కల్పించింది. 371 గ్రామాలకుగాను 192(52)శాతం గ్రామాలకు ఇంతవరకు పునరావాస, పునర్నిర్మాణ ప్రణాళికను ఖరారు చేయలేదని వెల్లడించింది. అలాగే ఒడిసా, చత్తీస్‌ఘర్‌ రాష్ట్రాల్లో ముంపును నివారించేందుకు నిర్మించాల్సిన రక్షణ కట్టల నిర్మాణంలో పురోగతి లేదని తెలిపింది.

భూసేకరణ, పునరావాసంపై పెట్టిన ఖర్చు వివరాలను సమర్పించకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన రూ.1,407.64 కోట్లను ఇంతవరకు రాబట్టుకోలేదని తెలిపింది. ప్రాజెక్టు పురోగతి విషయానికొస్తే 2017 జూలై నాటికి హెడ్‌వర్క్సులో 31 శాతం, కనెకట్టివిటీలో 55 శాతం పనులు జరిగాయి. డిజైన్లలో మార్పులు, భూసేకరణలో, కాలువ మార్గం నిర్థారణలో, డిజైన్లలో, డ్రాయింగుల్లో ఇతర ప్రజోపయోగ ఉపకరణాలను మార్చడంలో జాప్యం వల్ల పురోగతి మందగించిందని నివేదిక పేర్కొంది.

పని గడువును పూర్తి చేసేందుకు వీలుగా ఒప్పందంపు నిబంధనలకు వెసులుబాటు కల్పిస్తూ హెడ్‌వర్క్సు గుత్తేదారుకు రూ.1853.03 కోట్ల మేర పలు రాయితీలను అనుమతించారు. అయినా నిర్ణీత గడువుకు అనుగుణంగా పురోగతి లేదంది. పునరావాసం, పునర్నిర్మాణం కార్యకలాపాలను సమీక్షించి పర్యవేక్షించడం కోసం రాష్ట్రస్థాయి పర్యవేక్షక కమిటీలు, ప్రాజెక్టు స్థాయి కమిటీలు రాష్ట్ర పునరావాస పునర్నిర్మాణ విధానంలో పేర్కొన్న ప్రకారం సరైన సమయంలో సమావేశాలు నిర్వహించలేదని వెల్లడించింది.

అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించిన నిబంధనల అమలుపై పర్యవేక్షణ బలహీనంగా ఉందని నిర్దేశిత విధానాలు ఇంకా పాటించాల్సి ఉందని పేర్కొంది. అసమగ్రమైన ప్రణాళిక, డిజైన్ల ఖరారు, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం వంటి విషయాల్లో జాప్యం వల్ల 2004లో మొదలైన పోలవరం మందగతిలో ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఒప్పందపు నిబంధనలు పాటించడంలోనూ, డిపార్టుమెంటు వైఫల్యం కూడా ఒక కారణమని తెలిపారు. ఫలితంగా 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడం, ఆశించిన ప్రయోజనాలు పొందడం అంత తేలికకాదని, దుస్సాహసమని నివేదిక వెల్లడించింది.