అడ్వాణీకి మోదీ, అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు 

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ ఇవాళ 92వ ఏట అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. 

 ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాశ్‌ నడ్డా తదితరులు కూడా స్వయంగా ఎల్‌కే అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎల్‌కే అద్వానీకి పార్టీ సీనియర్లు, ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంతకు ముందు ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ అడ్వాణీ సేవలను గుర్తుచేసుకున్నారు. ‘‘మేధావి, రాజనీతిజ్ఞుడు, అత్యంత గౌరవనీయులైన నాయకుల్లో ఒకరిగా మన పౌరుల సాధికారత కోసం లాల్ కృష్ణ అడ్వాణీ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన జన్మదినం సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.

బీజేపీకి ఓ రూపమిచ్చి, దాన్ని బలోపేతం చేసేందుకు ఆయన కొన్ని దశాబ్దాల పాటు చెమటోడ్చారని మోదీ కొనియాడారు. అడ్వాణీ వంటి నాయకులు, నిస్వార్థ కార్యకర్తల కారణంగానే ఇవాళ దేశంలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదిగిందన్నారు. సిద్ధాంతం విషయంలో ఆయన ఒక్కసారి కూడా రాజీపడలేదని గుర్తుచేసుకున్నారు.