రాయితీలతో పెట్టుబడులు రావు.. పోటీతత్వమే

ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపారవేత్తలను ఆకట్టుకొనే పోటీతత్వంతో కూడిన పారదర్శక, వ్యాపారానుకూల పరిస్థితులేనని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉచిత విద్యుత్, చౌకగా భూమి, పన్నుల రాయితీల వల్ల ఒనగూడేదేమీ లేదని ధర్మశాలలో స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువైన పరిస్థితుల కల్పన విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలని రెండు రోజుల పాటు జరిగే పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభిస్తూ స్పష్టం చేశారు. 

వ్యాపారానుకూలతతో పాటు నియమ, నిబంధనలను సరళతరం చేయడం వల్లే పరిశ్రమలను, పెట్టుబడులను రాష్ట్రాలు ఆకర్షించగలుగుతాయని తెలిపారు. అంతే తప్ప ఉచితాల ఎరతో కాదని తేల్చి చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ వ్యాపార శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. రాయితీలు, తాయిలాల కల్పనలో పోటీ పడడం మాని పోటీతత్వాన్ని పెంపొందించుకోవడంలో రాష్ట్రాల నిగ్గు తేలాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. 

రానున్న ఐదేళ్ల కాలంలో భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు క్రియాశీలక భూమిక పోషించాలని మోదీ కోరారు. ప్రతికూల నిబంధనలు, అవాంఛిత జోక్యం వల్ల పారిశ్రామిక వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు క్రియాశీలక రీతిలో తమ బాధ్యతలను నిర్వర్తించాలని హితవు చెప్పారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం తాయిలాల జాతరే చేసేవని గుర్తు చేసిన మోదీ.. ‘ఓ రాష్ట్రం పన్నుల రాయితీ ఇస్తే మరో రాష్ట్రం ఉచిత విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చేది.. దీనివల్ల మరికొంతకాలం ఆగితే ఇంకొన్ని రాయితీలు పొందవచ్చని పెట్టుబడిదారులు ఆగేవారు.. ఫలితంగా రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయేవి’ అని మోదీ పేర్కొన్నారు. 

అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని పేర్కొన్న ఆయన తాయిలాల కల్పనలో పోటీపడడం వల్ల ఇటు రాష్ట్రాలకు కానీ.. సదరు పారిశ్రామిక వేత్తలకుకానీ ఎలాంటి ఉపయోగం ఉండదన్న వాస్తవికత సర్వత్రా కనిపిస్తోందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో ఈ దిశగా రాష్ట్రాల ఆలోచనలో గుణాత్మక పరివర్తన వచ్చిందని, ఇది ఎంతో ఆనందకరమైన విషయమని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

సరైన పర్యావరణ వ్యవస్థను కల్పించడంతో పాటు అనవసరమైన నియమ, నిబంధనలను, పర్మిట్ల విధానాన్ని తొలగించాలని ప్రధాని సూచించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడుల కోసం ఈ రకమైన సానుకూల పరిస్థితులను పాదుకొల్పడంలో పోటీ పడుతున్నాయని చెప్పారు. విధానాన్ని సరళీకరిస్తున్నాయని, చట్టాలను అవసరానుగుణంగా సవరిస్తున్నాయని కూడా మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. 

ఇటీవలి కాలంలో కాలంచెల్లిన ఎన్నో చట్టాలను ముఖ్యంగా అనవసరమైన వాటిని రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యాటక రంగ విస్తరణకు, అలాగే, ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తత్రేయ, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.