మళ్లీ తనదే విజయమని ట్రంప్ ధీమా 

ఒకపక్క తనపై అభిశంసన తీర్మానానికి డెమోక్రాట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పట్టును మరింత బిగించారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ తనను ఎన్నుకోకపోతే దేశం తీవ్రస్థాయిలో మాంద్య పరిస్థితులకు గురవుతుందని హెచ్చరించారు. లూసియానాలో జరిగిన రిపబ్లికన్ ర్యాలీలో మాట్లాడిన ఆయన మళ్లీ తనదే విజయమన్న ధీమాను వ్యక్తం చేశారు. 

‘మనమే గెలుస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ చాలా ఎక్కువ మెజారిటీతోనే విజయం సాధిస్తాం’ అని తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ భరోసా వ్యక్తం చేశారు. పలు రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో ట్రంప్ తన స్వరాన్ని పెంచడం గమనార్హం. తన అధ్యక్షతన అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని పుంజుకుంటోందని పేర్కొన్న ఆయన మళ్లీ తనను ఎన్నుకోకపోతే మాత్రం పరిస్థితి ప్రతికూలమైపోతుందని, మాంద్యం తాండవిస్తుందని హెచ్చరించారు.

పైగా ఈ ఆర్థిక మాంద్యం తీవ్రత ఇంతవరకు అమెరికా ఎన్నడూ చవిచూడనంత స్థాయిలో ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే డెమోక్రాట్లు దేశాన్ని ముక్కలు చేయడానికి యత్నిస్తున్నారని పేర్కొన్న ఆయన తనపై చేపట్టిన అభిశంసన వ్యాజ్యాలను తీవ్రంగా నిరసించారు. ఈ అభిశంసన తీర్మానంతో డెమోక్రాట్లు తనను వెంటాడుతున్నారని పేర్కొన్న ఆయన ఈ అభిశంసన దర్యాప్తును కూడా తప్పుబట్టారు. 

ఇదిలావుండగా ఈ నెల 13నుంచి ట్రంప్‌పై అభిశంసన వ్యాజ్యం మొదలవుతుందని అమెరికా హౌస్ నిఘా కమిటీ చైర్మన్ ఆడం షిప్ ప్రకటించారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జో బైడెన్, ఆయన కుమారుడిపై వచ్చిన రుజువుల్లేని అవినీతి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు జరపాలని ఉక్రెయిన్‌పై ట్రంప్ ఒత్తిడి తెచ్చినట్లుగా అభియోగాలు వచ్చాయి.