టీఎస్‌ఆర్టీసీ చట్టబద్ధతపై హైకోర్టు ప్రశ్నలు 

ఉమ్మడి ఏపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​గా విడిపోయినా ఇంకా ఏపీఎస్‌‌ఆర్టీసీ విభజన జరగలేదని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీఎస్‌‌ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, ఏపీఎస్‌‌ఆర్టీసీ విడిపోయిన తర్వాతే చట్టబద్ధ వస్తుందని స్పష్టం చేసింది. ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా  పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని, తమ అనుమతి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చట్టం- 1950 సెక్షన్ 47 (ఏ) ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీని రీకాన్‌స్టిట్యూట్ చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని చెప్పారు. కేంద్రాన్ని ఇప్పటి వరకు అనుమతి కోరలేదని తెలిపారు.   

సంస్థ విభజన కానప్పుడు టీఎస్​ ఆర్టీసీని ఎలా ఏర్పాటు చేసుకుంటారని, విభజన జరిగినట్లు ఆధారాలు ఏమీ లేవని తెలిపింది. ఏపీఎస్‌‌ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా కూడా ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌‌ సొలిసిటర్‌‌ జనరల్‌‌ రాజేశ్వర్‌‌ రావు కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీఎస్‌‌ఆర్టీసీలోని ఆస్తుల బదిలీ జరగలేదని, కేంద్రం వాటా కూడా బదిలీ కాలేదని పేర్కొన్నారు. 

విభజన చట్టంలోని షెడ్యూల్ 9 కిందికి ఆర్టీసీ వస్తుందని సీఎస్​ ఎస్కే జోషి కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు అడ్వకేట్‌‌ జనరల్‌‌ (ఏజీ) బీఎస్‌‌ ప్రసాద్, ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ సునీల్‌‌ శర్మ తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్​లో ఉందని పేర్కొన్నారు. 

ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున  ప్రజలకు అసౌకర్యం కలగకుండా టీఎస్ ఆర్టీసీని ఏర్పాటు చేశామని ఫైనాన్స్​ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. 

దీంతో హైకోర్టు కల్పించుకొని.. ‘‘ఓవైపు విభజన పెండింగ్ లో ఉందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామంటున్నారు. ఇది ఎట్ల సాధ్యమవుతుంది. చట్టంలో నేటికీ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగానే ఆర్టీసీ ఉన్నప్పుడు టీఎస్‌‌ఆర్టీసీ గురించి ఎలా చెబుతారు” అని ప్రశ్నించింది. కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసినప్పుడు మాతృసంస్థ ఆస్తుల్లో హక్కు ఎలా కోరుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ యాక్ట్ 47 (ఏ) ప్రకారం కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదని ధర్మాసనం నిలదీసింది.

‘‘ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరాలి కదా? కేంద్రం ఆమోదం లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారు” అని నిలదీసింది. అధికారులు తప్పులతో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగానే  ఇక్కడ తమకు జవాబులు చెబుతున్నారా అని సీఎస్​ను ప్రశ్నించింది.