ఆర్టీసీ సమ్మెపై మంకుపట్టు తగదని హైకోర్టు చివాట్లు    

ఆర్టీసీ సమ్మె పరిష్కారం దిశగా అడుగులు వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మంకుపట్టు తగదని హితవు పలికింది. ప్రజలను కష్టనష్టాల నుంచి గట్టెక్కించడమే లక్ష్యం కావాలని అభిప్రాయపడింది. అధికారులు ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆగ్రహించింది. 

‘‘తప్పుడు లెక్కలు చెప్పడం సరికాదు. లెక్కల గందరగోళంపై సీఎం కేసీఆర్‌ ప్రశ్నించలేదా!?’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ మచౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం నిలదీసింది.   

కోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌ జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వం ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. పొరుగు రాష్ర్టాలకు ఎన్నో పథకాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తదుపరి విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది. దానికి సీఎస్‌ సహా ఇతర అధికారులకు వ్యక్తిగత హాజరును మినహాయించింది.

‘‘ఆర్టీసీ కార్మికుల సమస్యపై ప్రభుత్వం ఇంత మంకుపట్టు పడుతుందని మేం భావించలేదు. అధికారులైనా, న్యాయ వ్యవస్థ అయినా ప్రజల కోసమే పని చేస్తాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఒకవైపు, ట్రేడ్‌ యూనియన్లు మరోవైపు మొండి పట్టు పడుతున్నారు. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి. మీ మధ్యలో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం గమనించాలి’’ అని సీజే చౌహాన్‌ హితవు పలికారు. 

ఎన్నో విధాలుగా చెప్పి చూశామని, కార్మికుల 45 డిమాండ్లలో 20 పరిష్కరించదగ్గవే ఉన్నాయని, రూ.49 కోట్లు ఇస్తే తక్షణమే నాలుగు ప్రధాన డిమాండ్లు పరిష్కారమయ్యేవని పునరుద్ఘాటించారు. ‘‘ఆ మాత్రం డబ్బు కూడా మా దగ్గర లేదని చెబితే ఎలా?" అంటూ విస్మయం వ్యక్తం చేశారు.