గిరిజనులు, కౌలుదారులకు అందుబాటులో లేని భరోసా 

భూమి లేని కౌలు రైతులకు, అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఎఫ్‌వొఆర్‌) కింద గుర్తించిన గిరిజన రైతులకు ప్రభుత్వ భరోసా నామమాత్రంగానే దక్కింది. గిరిజనులకు ఒక్క శాతం లోపు మందికే భరోసా సొమ్ము జమకాగా కౌలు రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.   

వ్యవసాయశాఖ గణాంకాల మేరకే ఆర్‌ఎఫ్‌వొఆర్‌ ఖాతాలు 64,196 కాగా వాటిలో 598 మాత్రమే భరోసాకు అర్హత పొందాయి. ఆర్‌వొఎఫ్‌ఆర్‌ కింద గుర్తింపు పొందడమంటే భూమిపై గిరిజనులకు హక్కు ఉన్నట్టు నిర్ధారణ. అయినా భరోసాను ఎందుకు తిరస్కరిస్తున్నారో చెప్పే నాథుడే లేడు. 

తొలుత 15.36 లక్షల కౌల్దార్లకు రూ.13,500 తానే ఇస్తానన్న జగన్ ప్రభుత్వం అనంతరం మార్గదర్శకాల సందర్భంగా 3 లక్షలకు లక్ష్యాన్ని తగ్గించింది. కౌలు రైతులకు రాష్ట్రం పలు షరతులు విధించింది. కొత్త కౌలు చట్టం ప్రకారం పంట సాగు హక్కు పత్రం (సిసిఆర్‌సి) ఉండాలి. సిసిసిఆర్‌సి పొందిన వారిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకే భరోసా వర్తిస్తుంది. ఆహార పంటలైతే కనీసం ఎకరం, హార్టికల్చర్‌ పంటలు, కూరగాయలైతే అర ఎకరం, తమలపాకు పంట పది సెంట్లు కౌలు రైతు సాగు చేయాలి. 

సిసిఆర్‌సి పొందడానికి భూమి యజమాని సంతకం తప్పనిసరి కావడంతో కార్డుల జారీ నామమాత్రంగా ఉంది. గతంలో ఎల్‌ఇసి, సివొసిలను 11 లక్షల మంది కౌలు రైతులు పొందారు. భూమి లేని కౌలు రైతులు ఏడు లక్షల వరకు ఉంటారన్నది సర్కారు అంచనా. అక్టోబర్‌ 2 నుంచి సిసిఆర్‌సిల జారీ ప్రారంభించగా ఇప్పటి వరకు 1.83 లక్షల మందికే సిసిఆర్‌సిలు ఇచ్చారు. వీటిలో భరోసా కోసం వ్యవసాయశాఖ పరిశీలనకు 21,707 రాగా కేవలం 388 మంది అర్హత పొందారు. మిగతావారందరిని పెండింగ్‌లోనే ఉంచారు.