అయోధ్యలో ఉత్కంఠ వాతావరణం 

అయోధ్య నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఓవైపు తీర్పు ప్రభావం తమపై ఉండబోదని ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు పెండ్లిళ్లు రద్దు చేసుకోవడమో లేదా పెండ్లి వేదికలను జిల్లా అవతలికి మార్చడమో చేస్తున్నారు. 

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తొలిసారిగా మందిర శిల్పాల తయారీని నిలిపివేసింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మి స్తామంటూ వీహెచ్‌పీ 1990లో అయోధ్యలో నిర్మాణ్ కార్యశాలను ప్రారంభించింది. మందిరం ఆకృతిని విడుదల చేసింది. దాదాపు 30 ఏండ్లుగా రాతి శిల్పాలను, ఇతర నిర్మాణాలను రూపొందిస్తున్నది. 

ప్రస్తుతం నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పనులను మొట్టమొదటిసారిగా నిలిపివేసినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. శిల్పులు ఇండ్లకు వెళ్లిపోయారని చెప్పారు. పనులను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలో రామ జన్మభూమి న్యాస్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తీర్పు ఎలా వచ్చినా శ్రేణులంతా సంయమనంతో ఉండాలని, వేడుకలు గానీ, నిరసనలు గానీ నిర్వహించొద్దని సూచించారు.

అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. వేడుకలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉన్నది. ఇది డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఫైజాబాద్ జిల్లాను రెడ్, యెల్లో, గ్రీన్, బ్లూ సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ఇందులో రెడ్, యెల్లో జోన్లు సున్నిత ప్రాంతాలు. వీటి భద్రతను పారామిలిటరీ బలగాలకు, గ్రీన్, బ్లూ జోన్ల భద్రతను సివిల్ పోలీసులకు అప్పగించారు. అయోధ్యలో భద్రత కోసం అదనపు డీజీపీ ర్యాంకు అధికారిని ఇంచార్జిగా నియమించారు. 

ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సందేశాలను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 1600 గ్రామాల నుంచి ఎంపిక చేసిన 16వేల మంది వలంటటీ ర్లను యాప్‌కు అనుసంధానించారు. అయోధ్యలోని స్కూళ్లను తాత్కాలికంగా జైళ్లుగా మార్చాలని, అనుమానితులను వాటిల్లో నిర్బంధించాలనే ప్రతిపాదన కూడా ఉన్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి.