అయోధ్య పై తుదితీర్పు నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఈ నెల 17వ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచాలని గురువారం సూచించింది. అయోధ్యలో మోహరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్‌కు అదనంగా నాలుగువేల మంది పారా మిలిటరీ సిబ్బందిని తరలించింది. 

మరోవైపు అయోధ్య నగరంలో ఉత్కంఠ నెలకొంటున్నది. స్థానికులు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

హిందూ, ముస్లిం వర్గాల నేతలు, ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాలని కోరుతున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే సంబురాలు చేసుకోబోమని, పటాకులు కాల్చడం, రంగులు చల్లుకోవడం వంటివి చేయమని, వ్యతిరేకంగా వస్తే ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టమని, నినాదాలు చేయబోమని వివిధ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు అని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు అన్నారు.

రేల్వేశాఖ ముందుజాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అన్ని రైళ్లలో భద్రత పెంచాలని ఆదేశించారు. స్టేషన్ల సమీపంలోని ప్రార్థనా మందిరాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణికుల సాంద్రత అధికంగా ఉండే 78 రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. రాత్రుళ్లు అన్ని లైట్లూ వెలుగుతూనే ఉండాలని ఆదేశించారు. వీవీఐపీలు, పారా మిలిటరీ సిబ్బంది పర్యటన వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లీక్ చేయవద్దని స్పష్టంచేశారు.