జిడిపి వృద్ధిపై నిర్మలా సీతారామన్  సమాలోచనలు

దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒత్తిడిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సుస్థిరత, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో  ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ, ఐఆర్‌డీఏఐ చీఫ్ సుభాష్ చంద్ర కుంతియా, ఐబీబీఐ చైర్మన్ ఎంఎస్ సాహూ, పీఎఫ్‌ఆర్డీఏ చైర్మన్ రవీ మిట్టల్ పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో దేశ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికి క్షీణించిన నేపథ్యంలో ఈ 21వ ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశం జరిగింది. 

రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లోనూ నిస్తేజపు ఛాయలు కనిపిస్తుండటంతో జీడీపీ పురోగతికి అవలంభించాల్సిన విధానాలపై రెగ్యులేటర్లతో నిర్మలా సీతారామన్ చర్చించారు. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి -1.1 శాతానికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో కీలక రంగాల వృద్ధిరేటు -5.2 శాతానికి పతనమైన సంగతీ విదితమే. ఇక వినీమయ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. 

దీంతో అన్ని రంగాల్లో అమ్మకాలు క్షీణించి మార్కెట్ తీవ్ర మందగమనంలో ఉండగా, వృద్ధిరేటు నేలచూపులు చూస్తున్నది. స్థూల ఆర్థికాంశాలు, దేశ ఆర్థిక వ్యవస్థ తీరుపై చర్చ జరిగింది. ఇంటర్-రెగ్యులేటరీ, సైబర్‌సెక్యూరిటీ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లపైనా చర్చించామన్న ఆయన ఈ రంగం సంక్షోభం సమసిపోయిందన్న విశ్వాసాన్ని కనబరిచారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో 75 శాతానికి సమానమైన టాప్-50 కంపెనీలను దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు. 

ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్డీఐ) బిల్లుపైనా చర్చ జరిగిందని సమాచారం. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో వివిధ రంగాల రెగ్యులేటర్లతో ఏర్పాటైనదే ఈ ఎఫ్‌ఎస్‌డీసీ. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అటాను చక్రవర్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నే, రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వీ సుబ్రమణ్యన్, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.