అమెరికా-చైనా వాణిజ్య యుద్దానికి తెర !

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఈ రెండు అగ్రదేశాలు పరస్పరం వేల కోట్ల డాలర్ల సుంకాలను విధించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కలవరపెడుతున్న సంగతీ విదితమే. అయితే దశలవారీగా ఇప్పటిదాకా విధించుకున్న ప్రతీకార సుంకాలను వెనుకకు తీసుకునేందుకు చైనా, అమెరికాలు అంగీకరించినట్లు తెలుస్తున్నది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావ్ ఫెంగ్ ఈ విషయమై సంకేతం ఇచ్చారు. 

గత రెండు వారాలుగా ఇరు దేశాల మధ్య స్పష్టమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతున్నాయని, ఇరువైపులా విడుతలవారీగా అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు సమ్మతించినట్లు చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన తుది ఒప్పందం ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. అయినప్పటికీ టారీఫ్‌ల ఉపసంహరణతో తొలి దశ ఒప్పందం జరిగిందని వెల్లడించారు. చైనా ఉప ప్రధాని ల్యూ హీ గత శుక్రవారం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్నూచిన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రాబర్ట్ లైథీజర్‌లతో ఫోన్‌లో మాట్లాడగా, ప్రస్తుత సంప్రదింపులపై ఇరు వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని సమాచారం.

వాణిజ్య యుద్ధం ముగిసిపోనుందన్న సంకేతాలు చైనా నుంచి వ్యక్తమవుతున్నా.. అమెరికా వైపు నుంచి మాత్రం కనిపించడం లేదు. గడిచిన ఏడాదికిపైగా కాలంలో అమెరికా-చైనాల మధ్య ఎన్నోసార్లు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అయితే ప్రతీసారి అర్ధాంతరంగానే ముగియడం, ఆ తర్వాత పరస్పర సుంకాలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దఫా అలా జరుగదన్న విశ్వాసాన్ని చైనా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అమెరికా నోటి నుంచి మాత్రం ఆ రకమైన ప్రకటనలు రావడం లేదు. 

చైనాతో వాణిజ్య లోటు ప్రమాదకరంగా ఉందని, అమెరికా సంపదను చైనా దోచుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సుంకాల సమరానికి తెర తీసిన సంగతి విదితమే. ఇటు తమ దేశంలోకి వస్తున్న వందలాది రకాల చైనా ఉత్పత్తులపై బిలియన్ డాలర్ల సుంకాలు ట్రంప్ వేయగా, చైనా కూడా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న అమెరికా వస్తువులపై అదే రీతిలో సుంకాలు బాదింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. వచ్చే నెలలో లండన్‌లో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ నెలలోనే ఇరువురి సమావేశం జరుగాల్సి ఉన్నది. అయితే చిలీ ఆసియా-పసిఫిక్ దేశాధినేతల సదస్సు రద్దు కావడంతో ఈ భేటీకి వీల్లేకుండా పోయింది. దీంతో డిసెంబర్‌లో నాటో సదస్సు తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ చర్చలకు వీలుందని వైట్‌హౌజ్ వర్గాల్లోని ఓ సీనియర్ అధికారి తెలిపారు.