అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు

అయోధ్య అంశంపై ఎటువంటి అనవసర ప్రకటనలు, వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులను కోరారు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పరిస్థితులపై చర్చించారు.  

వివాదానికి తావిచ్చే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని మంత్రులకు చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. కోర్టు తీర్పును ఓటమి లేదా గెలుపుగా భావించరాదని స్పష్టం చేశారు. మరోవైపు, ప్రధాని మోదీ ఢిల్లీ కాలుష్య వ్యవహారంపై మొదటి సారి స్పందించారు.

ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్యంపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు అవసరమైన యంత్రాలను వెంటనే అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఇన్‌ఫర్మేషన్‌ 

టెక్నాలజీ ఆధారిత మల్టీమోడల్‌ ప్లాట్‌ఫాం ‘ప్రగతి’ 31వ సమావేశాల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పీకే మిశ్రా రోజూవారీగా నమోదవుతున్న కాలుష్యస్థాయిని సమీక్షిస్తున్నారని తెలిపింది. మోదీ ఈ సమావేశంలో రూ. 61 వేల కోట్ల విలువ చేసే తొమ్మిది ప్రాజెక్టులను సమీక్షించారు.